BC Strategy: తెలంగాణ రాజకీయాలు మరో రసవత్తర ఎన్నికల సమరానికి వేదికవుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు కీలక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల పోరు ప్రధాన పార్టీల మధ్య జీవన్మరణ సమస్యగా మారింది. అధికార కాంగ్రెస్ ఓవైపు కండబలంతో పావులు కదుపుతుంటే, అసెంబ్లీ ఓటమి నుంచి కోలుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయి వ్యూహాలతో సమరశంఖం పూరించింది.
రాబోయే 2028 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ సమరమే అసలైన 'రిఫరెండం'గా మారబోతోందన్న అంచనాల నడుమ, గులాబీ అధినేత కేసీఆర్ వేస్తున్న సోషల్ ఇంజినీరింగ్ ఎత్తుగడలు అధికార పక్షానికి సవాల్ విసురుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాలకు వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్నల పదవీకాలం ముగియనుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
ఈ ఎన్నికల సమరంలో బలంగా బరిలోకి దిగేందుకు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి పేర్లను అధికారికంగా ప్రకటించింది. అయితే రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ ‘రెడ్డి’ సామాజిక వర్గానికే పట్టం కట్టడం ఇప్పుడు బీఆర్ఎస్‌కు అతిపెద్ద అస్త్రంగా మారిందంటున్నారు.
ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న గులాబీ బాస్.. సామాజిక సమీకరణాలపై పక్కా లెక్కలు వేస్తున్నారట. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి మళ్లీ పోటీకి విముఖత చూపడంతో, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ సీటును బీసీ వర్గానికి కేటాయించేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని సమాచారం.
ఈ నియోజకవర్గంలో బీసీ, ముఖ్యంగా ముదిరాజ్ ఓటర్ల ప్రాబల్యం భారీగా ఉండటంతో కాసాని వీరేశ్ ముదిరాజ్ పేరును బలంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు నాగేంద్ర గౌడ్ వంటి బలమైన బీసీ నాయకులు సైతం రేసులో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు బలమైన బీసీ కార్డును ప్రయోగిస్తే విజయం సులువవుతుందన్నది కేటీఆర్, కేసీఆర్ భావనగా కనిపిస్తోంది.
ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో గత ఉపఎన్నిక చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ కావడంతో గతంలో గట్టి పోటీనిచ్చిన రాకేష్ రెడ్డితో పాటు, ఉద్యమ నేత వాసుదేవరెడ్డి పేర్లను వడపోస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లాల కేడర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను లీడర్ల భుజాన పెట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్లు, ఉద్యోగుల సమస్యలపై విద్యావంతుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తినే బీఆర్ఎస్ ప్రధాన ఆయుధంగా మలుచుకోనుంది. సామాన్యుల ఓటింగ్ కంటే చదువుకున్న పట్టభద్రుల ఓటు సరళి ఎప్పుడూ భిన్నంగా, ప్రభుత్వ విధానాలకు అద్దం పట్టేలా ఉంటుంది. అటు అధికార బలం, ఇటు సోషల్ సమీకరణాల వ్యూహం.. ఈ రెండింటి మధ్య విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కడతారన్నది తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.


