Captain Smith Machar: 31 వేల అడుగుల ఎత్తులో గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో జరిగిన ఊహించని దాడిని సమర్థంగా ఎదుర్కొని, తన ప్రాణాన్ని పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను నిలబెట్టిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను ప్రపంచ నేతలు కొనియాడుతున్నారు. తీవ్ర గాయాలపాలైనా ప్రాణాలకు తెగించి విమానాన్ని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన మచ్చర్ ధైర్యసాహసాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘ఎక్స్’ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
‘మచ్చర్ నిజమైన హీరో.. భారత్ గర్విస్తోంది’: ప్రధాని మోడీ
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ‘రియల్ హీరో’గా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన అసమాన పోరాట పటిమను కొనియాడారు. కాక్‌పిట్‌లో కో-పైలట్ మారణాయుధంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినప్పటికీ, ఏమాత్రం వెరవకుండా ఆయన ప్రదర్శించిన సాహసం వల్లే పెను ముప్పు తప్పిందన్నారు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్చర్‌ను చూసి యావత్ దేశం గర్విస్తోందన్నారు. స్మిత్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
మచ్చర్‌కు సెల్యూట్.. చరిత్రలోనే అతిపెద్ద ఘోరం తప్పింది: నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం మచ్చర్ తెగువకు సెల్యూట్ చేశారు. అత్యంత సంక్షోభ సమయంలో అప్రమత్తమై మచ్చర్ కాక్‌పిట్ తలుపులు తెరవడంతోనే విమాన సిబ్బంది, ప్రయాణికులు లోపలికి ప్రవేశించి దుండగుడిని బంధించగలిగారని వెల్లడించారు. "ఒకవేళ మచ్చర్ ఆ సమయంలో అంతటి ధైర్యంతో ఎదురుదాడి చేయకపోయి ఉంటే, విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన మారణహోమం జరిగి ఉండేది" అని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. స్మిత్ చూపిన సమయస్ఫూర్తి వల్ల 166 మంది ఇజ్రాయెల్ పౌరులు సహా మొత్తం 174 మంది ప్రాణాలు నిలిచాయని కృతజ్ఞతలు తెలిపారు.
ఆకాశంలో నరకం..
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి బయలుదేరిన ఫ్లైదుబాయ్ ‘బోయింగ్ 737 మ్యాక్స్ 8’ విమానం జోర్డాన్ గగనతలంలో ప్రయాణిస్తుండగా భయానక ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో ఉన్న ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ మచ్చర్‌పై విరుచుకుపడి విమానాన్ని క్రాష్ చేసేందుకు కుట్ర పన్నాడు. పదునైన ఆయుధంతో మచ్చర్ ను తీవ్రంగా గాయపరిచాడు.
రక్తమోడుతున్న స్థితిలోనూ మచ్చర్ గట్టిగా ప్రతిఘటించడంతో పాటు తలుపులు తెరిచి కేకలు వేశారు. ఈ ఘర్షణ సమయంలో నియంత్రణ కోల్పోయిన విమానం కేవలం కొద్ది సెకన్లలోనే 31 వేల అడుగుల ఎత్తు నుంచి ఏకంగా 14 వేల అడుగుల కిందకు జారిపోయింది.
ప్రయాణికుల్లో ఉన్న మరో ఇద్దరు పైలట్లు సకాలంలో కాక్‌పిట్‌లోకి వచ్చి విమానాన్ని కంట్రోల్ లోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్టులో క్షేమంగా దించడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత పైలట్ మచ్చర్ వేగంగా కోలుకోవాలని అంతా ప్రార్థిస్తున్నారు. ఆపద సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఈ భారత పైలట్ చూపిన తెగువపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.


