KTR: సిరిసిల్ల బహిరంగ సభలో తనను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో తనకు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అవును.. నాకు హోటల్స్ ఉన్నాయి, అది నిజమే అని అన్నారు. 2006లోనే తాను ఒక హోటల్ పెట్టానని కేటీఆర్ తెలిపారు. ఈ 20ఏళ్లలో అది పెరిగి మూడు హోటళ్లు అయ్యిందని వెల్లడించారు. వ్యాపారం చేయడం తప్పా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు కేటీఆర్. అంతేకాదు.. తన హోటల్స్ కు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారంటూ రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ కూడా చెప్పారు కేటీఆర్.
వ్యాపారం చేయడం తప్పా?
రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా నాకు హోటల్స్ ఉన్న మాట వాస్తవమే అని కేటీఆర్ అన్నారు. 2006లోనే హోటల్ పెట్టానని వెల్లడించారు. అదిప్పుడు మూడు హోటల్స్ అయ్యాయని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో లేకుంటే, వ్యాపారం మీద ఫోకస్ పెట్టి ఉంటే.. తనకు 3 కాదు 10 హోటల్స్ ఉండేవన్నారు. తనకు హోటల్స్ ఉన్న విషయం ఎన్నికల అఫిడవిట్ లో కూడా పెట్టానని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఏదో కొత్తగా కనిపెట్టినట్లుగా బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. నా భార్య, పిల్లలకు బువ్వ పెట్టేందుకు వ్యాపారం చేస్తున్నానని కేటీఆర్ వివరించారు. రేవంత్ రెడ్డిలా ప్రజల మీద పడి దోచుకోవడం లేదన్నారు.
అమెరికాలో సంపాదించిన డబ్బుతో హోటల్ పెట్టా
''20ఏళ్ల క్రితం 2006లో నేను రాజకీయాల్లోకి వచ్చా. రేవంత్ రెడ్డిలా ప్రజల మీద పడి దోచుకుతినే అలవాటు నాకు లేదు. అమెరికాలో నేను సంపాదించిన డబ్బుతో 2006లో హైదరాబాద్ లో ఒక హోటల్ పెట్టుకున్నా. అప్పుడు కాంగ్రెస్ (రాజశేఖర్ రెడ్డి) ప్రభుత్వం ఉండేది. 20ఏళ్లలో ఆ ఒక్క హోటల్ పెరిగి 3 హోటల్స్ అయ్యింది. 2006లో పెట్టినా నేను సరిగా పట్టించుకోలేదు. నేను పట్టించుకుని ఉంటే, నేను రాజకీయాల్లో ఉండకపోయి ఉంటే 3 కాదు.. 10 హోటల్స్ చేస్తుంటి ఈపాటికి.
2009లో ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పాను
2009లో నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ లో నా ఆస్తుల వివరాలు తెలిపాను. 2009లో నేను ఎన్నికల అఫిడవిట్ లో తెలిపిన దాని గురించే రేవంత్ రెడ్డి ఇప్పుడు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటి.. నాకు హోటల్ ఉన్నదని నేనే చెబుతున్నా. ఏదో కొత్తగా కనిపెట్టినట్లు రేవంత్ బిల్డప్ ఇస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఉన్నదే రేవంత్ చెప్పారు.
ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం
వ్యాపారం చేసుకోవడం తప్పా? నా భార్య, పిల్లలకు బువ్వ పెట్టాలి కదా. వారికి బువ్వ పెట్టేందుకు నేను వ్యాపారం చేస్తున్నా. అందులో తప్పేముంది? ఈ రాజకీయం విడిచిపెట్టి నేను కనుక వ్యాపారాన్ని పట్టించుకుని ఉంటే 10 హోటల్స్ చేస్తుంటి. చాలా సంతోషం రేవంత్ రెడ్డి.. నా హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినందుకు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నీలా మంది మీద పడి నేను దోచుకోలేదు'' అంటూ ధ్వజమెత్తారు కేటీఆర్.


