Congress MLC Candidates: తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల సమరానికి కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా, విద్యావంతులు మాత్రమే ఓటు వేసే ఈ నియోజకవర్గాల్లో పార్టీ సాంప్రదాయ రాజకీయ నాయకులను పక్కనపెట్టింది. అత్యున్నత విద్యార్హతలు, అంతర్జాతీయ కార్పొరేట్ అనుభవం, లీగల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇద్దరు నేతలను బరిలోకి దించింది. ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్‌తో సమరానికి సిద్ధమైన ఆ ఇద్దరు అభ్యర్థుల పూర్తి ప్రొఫైల్స్, వారి రాజకీయ నేపథ్యాలు ఇవే.
సామ రామ్మోహన్ రెడ్డి:
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి ఎంపికైన సామ రామ్మోహన్ రెడ్డికి విద్యార్థి దశ నుంచే బలమైన పోరాట నేపథ్యం ఉంది.
విద్యార్హతలు & వృత్తి: ఇంజినీరింగ్ (బీటెక్) పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్‌బీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్‌గా కొనసాగుతున్నారు. పలు కీలక రాజ్యాంగపరమైన అంశాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పార్టీ న్యాయ విభాగం తరఫున వాదనలు వినిపించిన అనుభవం ఆయన సొంతం.
ఎన్‌ఎస్‌యూఐ నుంచి అంచెలంచెలుగా: 2003లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం (NSUI) ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్‌గా న్యాయవాదుల సమస్యలపై పోరాడారు.
మీడియా వార్ రూమ్ అస్త్రం: 2019 నుంచి పీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ, 2024లో టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 2,500లకు పైగా టెలివిజన్ డిబేట్లలో పాల్గొని విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీ భవన్ వార్ రూమ్ నిర్వహణ, మీడియా ప్రచార వ్యూహాల్లో కీలక సమన్వయకర్తగా వ్యవహరించారు.
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి:
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానానికి ఎంపికైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి నేపథ్యం పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
కుటుంబ వారసత్వం: తెలంగాణలో నాలుగు తరాలుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకే కట్టుబడిన ప్రతిష్టాత్మక కుటుంబం వీరిది. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ దిగ్గజంగా పేరుగాంచిన దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడే సర్వోత్తమ్ రెడ్డి.
గోల్డ్ మెడల్స్ & గ్లోబల్ కెరీర్: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ (బీఈ) పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ, ఎంఐఎం పట్టాలు పొందడమే కాకుండా రెండింటిలోనూ గోల్డ్ మెడల్స్ సాధించారు. భారత్‌తో పాటు అమెరికా, కెనడా, బ్రిటన్ (యూకే) దేశాల్లోని దిగ్గజ కార్పొరేట్ కంపెనీలలో బిజినెస్ అనలిస్ట్, క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
వ్యవసాయం నుంచి పునరుత్పాదక ఇంధనం దాకా: విదేశీ గడ్డపై తన ప్రతిభను నిరూపించుకొని స్వదేశానికి వచ్చి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయడంతో పాటు సోలార్ ఎనర్జీ, డిజిటల్ జనరేటర్లు, హాస్పిటాలిటీ రంగాలలో సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తగా ఎదిగారు.
పొలిటికల్ ట్రాక్: 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ, సూర్యాపేట నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ, పీసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
అభ్యర్థుల ఎంపికతో కాంగ్రెస్ ఇచ్చిన మెసేజ్..
డిగ్రీ పూర్తి చేసిన యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్పొరేట్ ఉద్యోగులు మాత్రమే ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో కేవలం రాజకీయ నినాదాలు పనిచేయవని కాంగ్రెస్ గుర్తించింది. కోర్టులు, మీడియాలో ప్రజల పక్షాన గళమెత్తే సామర్థ్యం ఉన్న లాయర్ సామ రామ్మోహన్ రెడ్డిని ఐటీ, రియల్ ఎస్టేట్, అర్బన్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ స్థానానికి.. గ్లోబల్ ఎక్స్‌పోజర్‌తో పాటు అగ్రికల్చర్, పరిశ్రమలపై పట్టున్న రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి ఎంపిక చేయడం ద్వారా విద్యావంతులను ఆకర్షించేందుకు హస్తం పార్టీ మార్గం సుగమం చేసుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


