Telangana Politics: తెలంగాణ గడ్డపై మరో రాజకీయ సంచలనానికి తెరలేస్తోంది. దశాబ్దాల పాటు దండకారణ్యంలో తుపాకీ చేతబట్టి రాజ్యాధికారం కోసం నెత్తురోడ్చిన విప్లవ దళాలు.. ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చాయి. తూటాల గర్జనతో రాని మార్పును.. ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ బాక్సుల ద్వారా సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. నక్సలైట్ ఉద్యమాలకు చారిత్రక కేంద్ర బిందువైన ఉమ్మడి వరంగల్ నేలను అడ్డాగా చేసుకుని సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు మాజీ మావోయిస్టుల అగ్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.
అడవి బాట నుంచి జనబాట దాకా
1970 నుంచి 2000 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ప్రత్యేకించి వరంగల్, కరీంనగర్ జిల్లాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం పీక్ స్టేజ్‌లో ఉండేది. ఆ తర్వాత కాలంలో భద్రతా బలగాల పహారా, ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ప్రభావం తగ్గుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ కగార్' ఉధృతితో సాయుధ పోరాటం చివరి దశకు చేరుకుంది.
ఈ క్రమంలో అడవులను విడిచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర స్థాయి కీలక మాజీ నేతలంతా ఇప్పుడు ఒకే తాటిపైకి వస్తున్నారు. "ఆయుధం వీడినా.. ప్రజల పక్షాన నిలబడే ఆశయం చావలేదు" అంటూ చట్టసభలే లక్ష్యంగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు.
వరంగల్ కేంద్రంగానే ఎందుకు?
తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాకా ఏ ఉద్యమానికైనా వరంగల్ జిల్లానే గుండెకాయ. విప్లవ భావజాలం, ప్రజా పోరాటాల చరిత్ర ఉన్న ఈ గడ్డ నుంచే తమ రాజకీయ అరంగేట్రం జరగాలని మాజీలు నిర్ణయించుకోవడానికి బలమైన నేపథ్యముంది. ఇక్కడి నుంచే గ్రామీణ ప్రాంతాలకు తమ అజెండాను విస్తరించడం సులువవుతుందని వారు భావిస్తున్నారు.
ప్రధాన ఎజెండా ఏమిటి?
ప్రత్యేక తెలంగాణ వచ్చి పదేళ్లు దాటినా సామాన్యుడి ఆత్మగౌరవానికి దక్కిన విలువేమిటన్నదే వీరి ప్రధాన ప్రశ్న. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పాలకులు మోసం చేశారని వీరి ప్రధాన ఆరోపణ. దోపిడీ లేని జన తెలంగాణ కావాలనేది వీరి ధ్యేయం. కార్పొరేట్ శక్తుల దోపిడీని అడ్డుకోవడం ప్రధాన లక్ష్యం. అటవీ హక్కుల కోసం పోరాడే ఆదివాసీలు, గిరిజనులు, సంక్షోభంలో ఉన్న రైతులు, నిరుద్యోగ యువత సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని చెబుతున్నారు. అవినీతి రహిత పాలనను ప్రజలకు అందిస్తామని అంటున్నారు. వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతిపై చట్టసభల్లో కచ్చితంగా నిలదీస్తామని గర్జిస్తున్నారు.
ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
గతంలో పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని, రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తి శూన్యత ఉందని మాజీ అన్నల విశ్లేషణ. అయితే ఈ పార్టీ ఏర్పాటు వల్ల ఎవరి ఓటు బ్యాంకు చీలుతుందనేది అత్యంత కీలకంగా మారింది.
వామపక్షాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వామపక్ష భావజాలం ఉన్న ఓటర్లు, పాలక పక్షాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బడుగు, బలహీన వర్గాల ఓట్లు ఈ కొత్త కూటమి వైపు మళ్లే అవకాశముందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎన్నికల రాజకీయాల్లో నిలబడగలరా?
నేటి కాలంలో ఎన్నికలు డబ్బులతో ముడిపడి ఉన్నాయి. ప్రజా ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కేడర్‌ను, ఓట్లను ఏ మేరకు నిలబెట్టుకోగలరన్నది అసలైన సవాల్‌గా మారింది. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా ఓటు హక్కు ద్వారా వ్యవస్థలో మార్పు తేవాలని చూస్తున్న ఈ మాజీ విప్లవకారుల ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమవుతుంది? గ్రామీణ తెలంగాణ సమాజం వీరి పిలుపునకు ఎలా స్పందిస్తుంది? అనేది తెలుసుకోవాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.












