దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రబీ సీజన్‌లో తప్పనిసిరి చేసిన ఆరు పంటలకు కనీసమద్దతు ధర (MSP)ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంత్రం ప్రధాని మోడీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి.
ఆయిల్ గింజలు, పప్పు దినుసులకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు గోధుమలు క్వింటాకు ధర రూ.25 పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కుసుమ పువ్వు ధర క్వింటాకు రూ.675 పెరగ్గా.. ఆవాల ధర క్వింటాకు రూ.413, పప్పుదినుసులు (కందిపప్పు) ధర క్వింటాకు రూ.390 పెంచినట్లు తెలిపారు. బార్లీ కనీస ధర క్వింటాకు రూ.136, శనగలు రూ.83 పెరగ్గా.. గోధుమల కనీస ధర క్వింటాకు రూ.25 మాత్రమే పెంచినట్టు వెల్లడించారు.
పంటల డైవర్సిఫికేషన్ (వైవిధ్యాన్ని) ప్రోత్సహించేందుకు, నిత్యావసరాల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకే పప్పుదినుసులు, ఆయిల్ గింజల ధరలను కేంద్రం పెంచినట్లు తెలుస్తోంది. అయితే, గోధుమల కనీసమద్దతు ధరను ఇంత తక్కువగా పెంచడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. గతేడాది రబీ సీజన్‌లో గోధుమల ఎంఎస్పీని కేంద్రం రూ.160 పెంచగా.. ఈసారి కేవలం రూ.25 మాత్రమే పెండచం గమనార్హం.
కేంద్ర కేబినెట్ ప్రకటన ప్రకారం.. 2014 నుంచి 2026 వరకు 3,715 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కేంద్రప్రభుత్వం సేకరించింది. 6 రబీ పంటల సేకరణ కూడా 2014-2026 మధ్య 3,921 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగినట్టు ప్రకటించింది. ఇదే సమయంలో గోధుమ రైతులకు రూ.7.31 లక్షల కోట్ల కనీసమద్ధతు ధర (ఎంఎస్‌పీ) చెల్లింపులు జరిగాయని, మిగతా రబీ పంటలకు రూ.8.36 లక్షల కోట్లు జరిగాయని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది.


