TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీఓలకు) స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి. సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య అంతర్గత వివాదాల వల్ల పల్లెల్లో అభివృద్ధి పనులు నిలిచిపోకుండా, చెక్కుల జారీ సజావుగా సాగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
7 రోజులు దాటితే కలెక్టర్ విచారణ.. చెక్ పవర్ రద్దు
గ్రామాల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల కోసం ఇచ్చే చెక్కులపై సంతకాలు చేయకుండా ఉప సర్పంచ్‌లు కావాలని కాలయాపన చేస్తే ఇకపై చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిర్దిష్టమైన, సరైన కారణం లేకుండా ఏడు రోజులకు మించి సంతకాలు చేయకుండా లేట్ చేస్తే, జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఆ జాప్యం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు నిర్ధారణ అయితే, చట్ట ప్రకారం ఉప సర్పంచ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటారు.
అంతేకాకుండా, పాలన స్తంభించకుండా ఉండేందుకు ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ లేదా ఎంపీడీవోలలో ఒకరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చే విశేషాధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రామాల్లో ప్రజాప్రతినిధుల ఈగో వార్లకు అడ్డుకట్ట పడినట్లు అయ్యింది.


