రాష్ట్ర అభివృద్ది ధ్యేయంగా ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్ పలుకిలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై కార్యాచరణ, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు కొత్త విద్యుత్ ప్రాజెక్టులు.. ఇలా పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఆర్థిక విధానంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనే దిశలో కీలకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన డీఏ అంశంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయించింది.
ఉద్యోగులకు డీఏతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు డీఆర్ కూడా విడుదల చేయనున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న డీఏల ఎరియర్స్‌ను మాత్రం దశలవారీగా వాయిదాల్లో చెల్లించనున్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది సుమారు రూ.2,500 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.
మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఈ వానాకాలంలో రాష్ట్రంలో సుమారు 17 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. రుతుపవనాల కాలం ముగిసే సమయానికి దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేబినెట్ దృష్టికి వచ్చింది. దీంతో కరువు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీ చర్చించి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
అదేవిధంగా కరువు పరిస్థితులపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రైతు సంఘాలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సమావేశాలు నిర్వహించి ఎల్‌నినో పరిస్థితులు, దాని ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. కరువు మండలాలను ప్రకటించడంతో పాటు రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరించనుంది.
అలాగే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సీజన్‌లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని సివిల్ సప్లయిస్ శాఖ అంచనా వేసింది. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
ఇక ఎల్‌నినో పరిస్థితులతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించింది. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ సుమారు 15 వేల మెగావాట్లుగా ఉంటే.. ఈ సీజన్‌లో 19,892 మెగావాట్లకు చేరింది. అంటే దాదాపు 20 వేల మెగావాట్ల స్థాయికి విద్యుత్ అవసరం పెరిగింది. గత ఏడాది నమోదైన గరిష్ట విద్యుత్ వినియోగం 16,613 మెగావాట్లు కాగా.. ఈసారి ఎక్కువ డిమాండ్ నమోదైంది.
ఈ క్రమంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా అవసరమైనంత విద్యుత్‌ను సమకూర్చుకోవాలని, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. అదే సమయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా మొత్తం సుమారు 7,800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ పరిశీలించింది. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో నిర్మించనున్న వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనులను కూడా వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మార్కెట్ నిర్మాణాన్ని పూర్తిగా ప్రభుత్వ నిధులతో చేపట్టాలని సూచించింది. పండ్లు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అవసరమైన ఆధునిక మౌలిక వసతులను అందించేలా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై కూడా ప్రభుత్వం సమీక్షకు సిద్ధమైంది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల మేరకు ఈపీసీ విధానంలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పునఃసమీక్షించాలని కేబినెట్ నిర్ణయించింది. అవసరం లేని ముందుకు సాగని ప్రాజెక్టులను రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మరోవైపు తెలంగాణలో డిజిటల్ మీడియా ప్రకటనలకు సంబంధించి ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజింగ్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటనల జారీకి ప్రత్యేక విధానం తీసుకురావడం ద్వారా ఈ రంగాన్ని ఒక నిర్దిష్ట వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టును మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. దీనితో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పనిచేసేందుకు మరో నలుగురు గ్రూప్-1 అధికారులను నియమించాలని నిర్ణయించింది.
మొత్తంగా ఈ కేబినెట్ సమావేశంలో తక్షణ సమస్యలతో పాటు భవిష్యత్ అవసరాలపై కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల డీఏలు, కరువు పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లు వంటి తక్షణ అంశాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ స్టోరేజ్, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష, కోహెడ ఫ్రూట్ మార్కెట్, డిజిటల్ మీడియా పాలసీ, ఢిల్లీలో ప్రభుత్వ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై నిర్ణయాలు వెలువడ్డాయి.
ముఖ్యంగా కరువు పరిస్థితులపై కేంద్రం నుంచి సాయం కోరడంతో పాటు విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో కొత్త ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను సూచిస్తున్నాయి.


