హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) నుంచి కడపకు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. విమానం టేకాఫ్ కాబోతున్న సమయంలో హఠాత్తుగా తన సీటు నుంచి లేచి అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ఆ ప్రయాణికుడు తెగబడ్డాడు. రన్‌వేపై సాంకేతికంగా అత్యవసరమైన ఈ సమయంలో సదరు వ్యక్తి చేసిన ప్రమాదకర చేష్టతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రయాణికుడి ఆకతాయి చర్యను వెంటనే పసిగట్టిన క్యాబిన్ క్రూ అత్యంత సమయస్ఫూర్తితో స్పందించింది. ప్రమాదాన్ని నివారించేందుకు తక్షణమే రంగంలోకి దిగిన సిబ్బంది, తోటి ప్రయాణికుల సహకారంతో సదరు వ్యక్తిని చాకచక్యంగా అడ్డుకుని సీటుకే పరిమితం చేశారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన పైలట్ విమాన ప్రయాణాన్ని నిలిపివేసి, ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని తిరిగి బే స్థానానికి మళ్లించి, ప్రయాణికుడిని కిందికి దించేశారు.
ఆ ప్రయాణికుడిని ఎయిర్ పోర్టులకు పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తలపెట్టేలా వ్యవహరించడమే కాకుండా విమానయాన భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ప్రయాణికుడు మద్యం మత్తులో ఇలా ప్రవర్తించాడా? లేక మానసిక ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నాయా? అనే కోణంలో సీఐఎస్ఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన కాసేపు తర్వాత విమానాశ్రయ భద్రతాధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రయాణానికి సురక్షితమని ధ్రువీకరించారు. నిబంధనల ప్రకారం అన్ని తనిఖీలు పూర్తి చేసుకున్న అనంతరం ఇండిగో విమానం నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా కడపకు పయనమైంది. విమాన సిబ్బంది చాకచక్యంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తోటి ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.


