ది రియల్ హీరో మన స్మిత్ మచ్చర్
ఫ్లై దుబాయ్ ఫ్లైట్ ని కాపాడింది ఆయనే
9/11 తరహా ప్రమదాన్ని తప్పించిన కెప్టెన్
ఎవరీ స్మిత్ మచ్చర్..?
విమానం 34 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి దూసుకెళ్లింది. కాక్‌పిట్‌లో ఉన్న కెప్టెన్‌పై కోపైలట్ కత్తితో దాడి చేశాడు. ఒళ్లంతా రక్తం. శరీరంపై తీవ్ర గాయాలు. అయినా ఆ పైలట్ తన గురించి ఆలోచించలేదు. తన ముందు ఉన్న వందల మంది ప్రయాణికుల ప్రాణాల గురించే ఆలోచించాడు.
కింద పడిపోయిన స్థితిలోనూ కాక్‌పిట్ డోర్ తెరిచాడు. ఆ ఒక్క సాహసమే విమానంలోని ప్రయాణికులకు కాక్‌పిట్‌లోకి వెళ్లే అవకాశం ఇచ్చింది. దాంతో ప్రయాణికులు కోపైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానంలో ఉన్న మరో ఇద్దరు శిక్షణ పొందిన పైలట్లు కాక్‌పిట్‌లోకి వెళ్లి విమానాన్ని కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఇంతకీ ఎవరా హీరో..? ఆయనే భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్.
రైట్ టైమ్.. రైట్ డెసిషన్
ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో ఊహించుకోవడం కూడా కష్టం. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మచ్చర్ పేరు మార్మోగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వరకు పలువురు ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు.
34 వేల అడుగుల ఎత్తులో భయం భయం
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు బయలుదేరింది ఫ్లైదుబాయ్ FZ1073. బోయింగ్ 737 మ్యాక్స్ విమానంలో 170 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో కాక్‌పిట్‌లో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కోపైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేశాడు. కత్తిపోట్లతో మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం ప్రమాదకరంగా కిందికి దూసుకెళ్లింది.
విమానం దాదాపు 14 వేల అడుగుల మేర కేవలం 30 సెకన్లలో దిగిపోయింది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే విమానం రడ్డర్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడ్డాయి. అంటే ఇది కేవలం కాక్‌పిట్‌లో జరిగిన గొడవ కాదు. విమానం మొత్తం ప్రాణాంతక పరిస్థితిలోకి వెళ్లిపోయింది.
రక్తసిక్తమైనా.. ఆ ఒక్క పని చేసిన మచ్చర్
ఇక్కడే స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యం బయటపడింది. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఆయన కాక్‌పిట్ నేలపై పడిపోయారు. రక్తం కారుతున్నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. బయట ఉన్న ప్రయాణికులు లోపలికి వస్తేనే కోపైలట్‌ను ఆపగలరని గ్రహించారు.
అప్పుడు మచ్చర్ చేసిన పని విమానంలోని 174 మంది ప్రాణాలకు కీలకంగా మారింది.
కాక్‌పిట్ డోర్ తెరవడం అంత ఈజీ కాదు...
సాధారణంగా విమానం ఎగురుతున్న సమయంలో కాక్‌పిట్ డోర్ భద్రతా కారణాల వల్ల గట్టిగా లాక్ అయి ఉంటుంది. 9/11 తర్వాత కాక్‌పిట్ భద్రతా వ్యవస్థలు మరింత కఠినంగా మారాయి. అలాంటి సమయంలో లోపల నుంచి డోర్ తెరవడం కూడా అత్యంత కీలకమైన చర్య. కానీ మచ్చర్ ఆ సమయంలో కింద పడిపోయి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ తన వద్ద ఉన్న చివరి శక్తిని ఉపయోగించి డోర్ రిలీజ్ బటన్ యాక్టివేట్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి దాంతో మార్గం ఏర్పడింది. అదే ఈ మొత్తం ఘటనలో అత్యంత కీలకమైన మలుపు.
మచ్చర్ డోర్ తెరవకపోతే?
ఇదే ఇప్పుడు ఈ ఘటనలో అతిపెద్ద ప్రశ్నగా మారింది. కాక్‌పిట్ డోర్ మూసి ఉండి ఉంటే బయట ఉన్న ప్రయాణికులు లోపల ఏం జరుగుతుందో చూసే అవకాశం ఉండేది కాదు. కోపైలట్ నియంత్రణలో ఉన్న విమానం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండేది.
కానీ మచ్చర్ డోర్ తెరిచారు. ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లారు. కోపైలట్‌ను పట్టుకున్నారు. అతడి చేతులను కట్టేశారు. అదే సమయంలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌కు విమానంలో ఉన్న ఓ డెంటిస్ట్ చికిత్స అందించారు.
ఇక్కడే ఇంకో కీలక పరిణామం కూడా జరిగింది. విమానంలోనే ఇద్దరు ఫ్లైదుబాయ్ పైలట్లు ప్రయాణికులుగా ఉన్నారు. వారు విమాన సిబ్బందిలో భాగమే కానీ ఆ సమయంలో డ్యూటీలో లేరు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న తర్వాత వారు కాక్‌పిట్‌లోకి వెళ్లి విమానాన్ని నియంత్రించారు. చివరకు విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
మజిల్ మెమరీ.. మచ్చర్‌ను ఆదుకున్నదిదేనా?
ఇంతటి గాయాల మధ్య మచ్చర్ ఎలా స్పందించగలిగారు? ఆయనకు సన్నిహితుడైన వైద్యుడు జినిత్ షా చెప్పిన వివరాల ప్రకారం, మచ్చర్ విషయంలో మజిల్ మెమరీ కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. మజిల్ మెమరీ అంటే కండరాలకు నిజంగా జ్ఞాపకశక్తి ఉందని కాదు. ఒక పనిని పదే పదే సాధన చేయడం వల్ల మెదడు, నాడీ వ్యవస్థ ఆ కదలికలను అత్యంత సహజంగా చేయగల స్థాయికి చేరుకోవడాన్ని సాధారణంగా మజిల్ మెమరీ అంటారు.
పైలట్ జీవితంలో అత్యవసర పరిస్థితులపై పదేపదే శిక్షణ ఉంటుంది. కాక్‌పిట్‌లోని నియంత్రణలు, అత్యవసర విధానాలు, డోర్ వ్యవస్థలు వంటి వాటిపై నిరంతర ప్రాక్టీస్ ఉంటుంది. అందుకే తీవ్రమైన ఒత్తిడిలోనూ మచ్చర్ ఆలోచించి ఒక్కో అడుగు వేయడం కంటే, శిక్షణ ద్వారా అలవాటైన చర్యలను వేగంగా అమలు చేసి ఉండవచ్చని జినిత్ షా అభిప్రాయపడ్డారు.
స్మిత్ మచ్చర్ ఎవరు?
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. స్మిత్ మచ్చర్ చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని కలలు కన్న వ్యక్తి కాదు. ముంబయికి చెందిన మచ్చర్ మొదట కుటుంబ వ్యాపారంలోకి వెళ్లాలని భావించారు. టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ చదివారు. తర్వాత మేనేజ్‌మెంట్ వైపు వెళ్లారు. 19 ఏళ్ల వయసులో ఒక ఏవియేషన్ సెమినార్‌కు వెళ్లడం ఆయన జీవితాన్నే మార్చేసింది. అక్కడే విమానయాన రంగంపై ఆసక్తి పెరిగింది.
న్యూజిలాండ్‌లో శిక్షణ తీసుకుని పైలట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత స్పైస్‌జెట్‌లో సుదీర్ఘకాలం పనిచేశారు. అక్కడ సీనియర్ కమాండర్, లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. స్పైస్‌జెట్‌లో ఆయన 9,500కు పైగా గంటలు ప్రయాణించినట్లు తెలుస్తోంది. 2022లో ఫ్లైదుబాయ్‌లో చేరి డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా పనిచేస్తున్నారు.
అంతేకాదు.. 2017లో ముగ్గురు పైలట్ మిత్రులతో కలిసి ముంబయిలో aspiring pilots కోసం ఒక అకాడమీని కూడా ప్రారంభించారు. యువ పైలట్లకు మెంటర్‌గా వ్యవహరించారు. అంటే విమానాన్ని నడపడమే కాదు.. మరొక తరం పైలట్లను తయారు చేయడంలోనూ ఆయనకు అనుభవం ఉంది. ప్రయాణికులు సురక్షితంగా బయటకు రావాలి.. అదే ఆయన సిద్ధాంతం.
మచ్చర్ గతంలో ఏం చెప్పారో తెలుసా..?
మచ్చర్ గతంలో పైలట్ బాధ్యత గురించి మాట్లాడిన సందర్భాల్లో చెప్పిన మాటలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విమానం ఆలస్యమవడం తనకు పెద్ద సమస్య కాదని, ప్రయాణికులు సురక్షితంగా విమానం నుంచి బయటకు నడిచి వెళ్లడమే తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. ఆ మాటలు ఇప్పుడు ఆయన చర్యల్లో కనిపించాయి. తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఆయన మొదట ఆలోచించింది తన గురించి కాదు. విమానంలో ఉన్న వారి గురించి.
మరో 9/11 తరహా విపత్తు తప్పిందా?
అందుకే ప్రధాని మోదీ కూడా ఈ ఘటనను ప్రస్తావిస్తూ మచ్చర్ చర్యలు మరో 9/11 తరహా విపత్తును తప్పించడంలో కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఒకవేళ మచ్చర్ కాక్ పిట్ డోర్ తెరిచి ఉండకపోతే.. కో పైలట్ విమానాన్ని టెల్ అవీవ్ తీసుకెళ్లి ఏదైనా పెద్ద భవనాన్ని కూల్చేసేవాడని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఏమో అది నిజమేనేమో..?
మచ్చర్ చేసినది విమానాన్ని ఒంటరిగా సురక్షితంగా ల్యాండ్ చేయడం కాదు. ఆయన తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్ డోర్ తెరిచి, బయటివారికి లోపలికి వచ్చి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత విమానంలో ఉన్న శిక్షణ పొందిన పైలట్లు నియంత్రణ చేపట్టి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
హీరోగా నిలిచిన ముంబయి పైలట్
ఇప్పుడు స్మిత్ మచ్చర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కోపైలట్ దాడికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా దర్యాప్తులోనే ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ సహా పలు దేశాల అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. S
కానీ ఈ ఘటనలో ఒక విషయం మాత్రం ఇప్పటికే చరిత్రలో నిలిచిపోయింది. కాక్‌పిట్‌లో కత్తిపోట్లతో రక్తసిక్తమైన ఒక పైలట్...
చేతిలో స్టీరింగ్ పట్టుకునే శక్తి కూడా లేకుండా నేలపై పడిపోయిన ఒక కెప్టెన్... అయినా చివరి శక్తిని కూడదీసుకుని కాక్‌పిట్ డోర్ తెరిచాడు. ఆ ఒక్క డోర్ తెరుచుకోవడంతో ప్రయాణికులకు లోపలికి వచ్చే మార్గం ఏర్పడింది. దాడి చేసిన కోపైలట్ అదుపులోకి వచ్చాడు. విమానం మళ్లీ నియంత్రణలోకి వచ్చింది.
చివరకు 170 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అందుకే స్మిత్ మచ్చర్ కథ కేవలం ఒక విమాన ప్రమాదం నుంచి బయటపడిన కథ కాదు. చివరి క్షణంలోనూ తన బాధ్యతను మరచిపోని ఒక పైలట్ కథ. ఆయన ప్రాణం ప్రమాదంలో ఉన్నా.. వందల మంది ప్రాణాల కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న భారతీయ కెప్టెన్ కథ.
అందుకే.. స్మిత్ మచ్చర్.. ది రియల్ హీరో!


