తెలంగాణ

బాపు బొమ్మ సాక్షిగా.. బరితెగించిన మందు మాఫియా.. డ్రైడే నాడు ‘బ్లాక్‌’ దందా

రచన: NK••8 నిమిషాల పఠనం

Liquor Mafia: జాతిపిత మహాత్మా గాంధీ జీవితాంతం మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడారు. సమాజం మద్యానికి దూరంగా ఉండాలన్న ఆయన ఆశయాలను గౌరవిస్తూ ప్రభుత్వం ఏటా అక్టోబర్ 2న డ్రై డే పాటిస్తుంది. కానీ రాజధాని నగరంలో క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే జాతిపిత ఆశయాలు బస్తీ సందుల్లో బూడిదపాలవుతున్నాయి.

* గాంధీ జయంతికే ఎసరు

* డ్రై డే నాడు ‘బ్లాక్‌’ దందా.. క్వార్టర్‌ రూ.250

* వైన్‌ షాపులకే తాళాలు.. గల్లీల్లో మాత్రం ఏరులై పారుతున్న మద్యం

* అడిగిందే తడవు.. ఏ బ్రాండ్ కావాలన్నా ఇళ్లలోనే డంప్‌లు

* సింగరేణి కాలనీ, నందనవనం, లక్ష్మీనరసింహ నగర్ స్లమ్‌లే సేఫ్ జోన్లు

* నిఘా వ్యవస్థకు నెలనెలా ‘మామూలు’?

Liquor Mafia: జాతిపిత మహాత్మా గాంధీ జీవితాంతం మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడారు. సమాజం మద్యానికి దూరంగా ఉండాలన్న ఆయన ఆశయాలను గౌరవిస్తూ ప్రభుత్వం ఏటా అక్టోబర్ 2న డ్రై డే పాటిస్తుంది. కానీ రాజధాని నగరంలో క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే జాతిపిత ఆశయాలు బస్తీ సందుల్లో బూడిదపాలవుతున్నాయి. అధికారికంగా వైన్‌షాపులు, బార్లకు తాళాలు పడినా.. గల్లీల్లో మాత్రం మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు పెగ్గులుగా సాగుతోంది. బోర్డులకే డ్రైడే పరిమితమైందని, తమ దందాకు కాదంటూ అక్రమార్కులు యథేచ్ఛగా బరితెగించి విక్రయాలు సాగిస్తున్నారు.

ప్రభుత్వ ధరకు రెట్టింపు దోపిడీ.. క్వార్టర్‌కు రూ.250 వసూలు!

డ్రై డే వచ్చిందంటే చాలు మద్యం ప్రియుల బలహీనతే పెట్టుబడిగా అక్రమార్కులు కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో ఎమ్మార్పీ రూ.180 ఉండే ఆర్డినరీ క్వార్టర్‌ బాటిల్‌ ధరను ఏకంగా రూ.250కి పెంచేశారు. ఇక ప్రీమియం బ్రాండ్లపై అదనంగా రూ.100 నుంచి రూ.150 వరకు బాదేస్తున్నారు. రూ.170 ఉండే బీరును సైతం రూ.260 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. షాపులు ఎక్కడా తీయరని, దొరకడమే ఎక్కువని, నచ్చితే తీసుకోవచ్చంటూ కస్టమర్ల ముఖం మీదే ఖరాఖండీగా చెబుతూ నిలువుదోపిడీకి తెరలేపారు.

ఏ బ్రాండ్‌ అడిగినా రెడీ.. లోకల్‌ టు ఇంపోర్టెడ్‌ దాకా ఇంట్లోనే స్టాక్!

ఈ అక్రమ విక్రయాల్లో కేవలం చౌకబారు మద్యం మాత్రమే దొరుకుతుందనుకుంటే పొరపాటే. రెగ్యులర్ వైన్‌షాపుల్లో కూడా దొరకని స్థాయిలో రకరకాల బ్రాండ్లు ఈ రహస్య అడ్డాల్లో గుట్టలుగా పోసి ఉంచారు. రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లెండర్స్ ప్రైడ్, సిగ్నేచర్ వంటి పాపులర్ విస్కీలతో పాటు మ్యాన్షన్ హౌస్ బ్రాందీ, ప్రీమియం బీర్లు, విదేశీ బ్రాండ్లు సైతం అడిగిందే తడవుగా చేతికి అందుతున్నాయి. ముందురోజే వైన్‌షాపుల సిండికేట్లతో కుమ్మక్కై కార్టన్ల కొద్దీ సరుకును తరలించి, నివాస గృహాల అటకలు, కిరాణా దుకాణాల వెనుక గదులు, పాత గోదాముల్లో డంప్ చేసి ఆర్డర్ రాగానే క్షణాల్లో బయటకు తీస్తున్నారు.

బస్తీలే అడ్డాలు.. సింగరేణి కాలనీ, నందనవనం కేంద్రంగా పక్కా నెట్‌వర్క్!

నగరంలోని మురికివాడలు, బస్తీ ప్రాంతాలనే ఈ మాఫియా తమ సురక్షిత స్థావరాలుగా మార్చుకుంది. సింగరేణి కాలనీ, నందనవనం, చంపాపేట్ సమీపంలోని లక్ష్మీనరసింహ నగర్, యాదగిరి నగర్ వంటి ప్రాంతాల్లో ఈ అక్రమ దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. చిన్న చిన్న అద్దె గదులు, ఇరుకైన సందుల్లోని పెంకుటిళ్లను గోదాములుగా వాడుకుంటూ, కేవలం తెలిసిన కస్టమర్లకే ఫోన్లలో సమాచారం ఇస్తూ వ్యవహారం నడిపిస్తున్నారు. ఎక్కడికి రావాలో సంకేతాలు ఇచ్చి, నగదు తీసుకోగానే నల్ల కవర్లలో బాటిళ్లు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా పంపించేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పాత బైకులు, ఆటోల సీట్ల కింద దాచి బస్తీ సరిహద్దులు దాటించే డెలివరీ నెట్‌వర్క్ కూడా నడుస్తుండటంతో చీకటి పడేకొద్దీ అనుమానాస్పద వ్యక్తుల రాకపోకలు పెరిగి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఎక్సైజ్ నిఘా నిద్రపోతోందా.. లేక చేతులు తడిసాయా?

ప్రతి ఏటా డ్రైడేకి ముందు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా, చెక్‌పోస్టులు, విస్తృత గస్తీ అంటూ ఆర్భాటంగా ప్రకటనలు జారీ చేస్తుంది. మరి క్షేత్రస్థాయిలో కళ్ల ముందే ఇంత బహిరంగంగా గల్లీగల్లీకీ మద్యం దొరుకుతుంటే ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, లోకల్ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వైన్‌షాపుల నుంచి ముందురోజే వందల పెట్టెల మద్యం బస్తీలకు ఎలా తరలిపోయిందో డిపో అధికారులు గుర్తించలేకపోవడం, స్థానికంగా ఇంత పెద్దఎత్తున సరుకు నిల్వ ఉన్నా ఇంటెలిజెన్స్‌కు సమాచారం లేకపోవడం వెనుక లోతైన లోపాలు కనిపిస్తున్నాయి. స్థానిక సిబ్బందికి నెలవారీ మామూళ్లు ముడుతుండటం వల్లే అంతా తెలిసినా కళ్లు మూసుకుంటున్నారన్న ఆరోపణలు స్థానికుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

వ్యవస్థ కదలాలి.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి!

గాంధీ జయంతి నాడు డ్రైడే అనేది కేవలం ప్రభుత్వ క్యాలెండర్లకు, ప్రకటనలకే పరిమితమైతే చట్టంపై సామాన్యుడికి నమ్మకమే లేకుండా పోతుంది. బస్తీల్లోని పేద, కార్మిక వర్గాల శ్రమను దోచుకుంటూ వారి బలహీనతలను సొమ్ము చేసుకుంటున్న ఈ అక్రమ సిండికేట్‌పై ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక సిబ్బంది ప్రమేయం లేకుండా ప్రత్యేక నిఘా బృందాలతో సింగరేణి కాలనీ, నందనవనం తదితర ప్రాంతాల్లో తక్షణమే మెరుపు దాడులు నిర్వహించాలి. కేవలం క్వార్టర్లు అమ్ముతున్న చిరు వ్యాపారులను మాత్రమే కాకుండా, వారికి టోకుగా మద్యం సరఫరా చేసిన వైన్‌షాపుల లైసెన్సులను రద్దు చేసి, సిండికేట్ సూత్రధారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినప్పుడే వ్యవస్థపై భయం పుడుతుంది.

#Liquor Mafia#Liquor Sales#Dry Day#Mahatma Gandhi Jayanti#Hyderbad#Bastis#Slums#Yadagiri Nagar#Singareni Colony#Nandanavanam#Champapet#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి