TCongress: ఎన్నికల నామినేషన్ గడువు ముగిసే క్షణం దాకా జాబితాలు తేల్చని కాంగ్రెస్ శైలికి భిన్నంగా, ఏకంగా ఆరు నెలల ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసి అందరికీ షాక్ ఇచ్చింది పీసీసీ. అయితే ముందస్తు వ్యూహంతో పైచేయి సాధించాలనుకున్న కాంగ్రెస్ పెద్దల ప్లాన్ ఇప్పుడు బెడిసికొట్టిందని చెబుతున్నారు.
రెండు నియోజకవర్గాల్లోనూ ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడంతో గాంధీభవన్‌లో అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. "ఓట్లు దండుకోవడానికి వెనుకబడిన వర్గాలు కావాలి.. పదవులు కట్టబెట్టేసరికి మాత్రం రెడ్డి సామాజిక వర్గమే గుర్తొస్తుందా?" అంటూ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు.
రెండు సీట్లు.. ఒకే మార్క్ నిర్ణయం
తెలంగాణలోని రెండు కీలక గ్రాడ్యుయేట్ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ - రంగారెడ్డి- మహబూబ్‌నగర్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి, ఖమ్మం - నల్గొండ - వరంగల్ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేర్లను ఖరారు చేసింది.
ఈ రెండు నియోజకవర్గాలు రాష్ట్రంలోని సగానికి పైగా విస్తీర్ణాన్ని, ఉద్యోగ-ఉపాధ్యాయ-పట్టభద్రుల ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. అలాంటి స్థానాల్లో కనీసం ఒక్కటైనా బీసీ వర్గానికి కేటాయిస్తారని ఆశించిన క్యాడర్‌కు ఈ ప్రకటన మింగుడుపడటం లేదు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన మెజారిటీగా ఉన్న వెనుకబడిన వర్గాలను పూర్తిగా పక్కనబెట్టి, కేవలం రెడ్డి వర్గానికే రెండు స్థానాలు కట్టబెట్టడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
కాగితాలకే పరిమితమైన ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’?
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించింది. వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారంలో న్యాయమైన వాటా ఇస్తామని రాహుల్ గాంధీ సైతం హామీ ఇచ్చారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో తమకు దక్కుతున్న ప్రాధాన్యం శూన్యమని బీసీ నేతలు మండిపడుతున్నారు. "విద్యావంతుల సమస్యలపై రోడ్లెక్కి కొట్లాడే అర్హత బీసీ, ఎస్సీ యువతకు లేదా? మా ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసి, తీరా అవకాశాలు వచ్చేసరికి ఒకే వర్గానికి పెద్దపీట వేయడమేనా మీ మార్కు ప్రజాపాలన?" అంటూ సొంత పార్టీలోని నాయకులే తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
‘గెలుపు గుర్రాలు’ ముసుగులో అన్యాయం!
ఈ వ్యతిరేకతపై పార్టీ అధిష్టానం ఇస్తున్న సమర్థన మరింత వివాదానికి కారణమవుతోంది. క్షేత్రస్థాయి సర్వేలలో సామ రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తం రెడ్డిలకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుబట్టడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఎన్నికలోనూ ‘గెలుపు గుర్రాలు’ అనే నెపంతో అగ్రవర్ణాలకే ప్రాధాన్యం కల్పిస్తూ, బీసీలను కేవలం జెండాలు మోసే వర్గానికే పరిమితం చేస్తున్నారనే ఆవేదన తీవ్రమవుతోంది.
గవర్నర్ కోటా బుజ్జగింపులు ఫలిస్తాయా?
నష్టనివారణ కోసం టీపీసీసీ నాయకత్వం రంగంలోకి దిగింది. త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని, ఈ రెండింటితో కలిపి మొత్తం ఐదు స్థానాలను ఒకే యూనిట్‌గా చూస్తున్నామని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది. అయితే ఓటర్లు స్వయంగా ఓట్లేసి ఎన్నుకునే చట్టసభల్లో కాకుండా, కేవలం నామినేటెడ్ పోస్టులతో సరిపెడతామంటే అంగీకరించేది లేదని బీసీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
పట్టభద్రుల ఎన్నికల ముంగిట రేగిన ఈ సామాజిక చిచ్చు కాంగ్రెస్ ఓటుబ్యాంకును ఏ మేరకు దెబ్బతీస్తుందో, ఈ అసంతృప్తిని విపక్షాలు ఎలా తమకు అనుకూలంగా మలుచుకుంటాయో వేచి చూడాలి.


