ఇంట్లో పూజ ఎవరు చేయాలి?.. మగవారా.. ఆడవారా?.. అనే విషయంలో మన ఇళ్లలో ఎన్నో రకాల ఆచారాలు, నమ్మకాలు కనిపిస్తాయి. కానీ శాస్త్ర సంప్రదాయాలను పరిశీలిస్తే.. నిత్యపూజ విషయంలో ప్రధానంగా కనిపించేది లింగభేదం కాదు.. భక్తి, శుచిత్వం, నియమం.
వేద సంప్రదాయానికి అనుబంధమైన గృహ్యసూత్రాల్లో గృహస్థాశ్రమంలోని దంపతులిద్దరికీ ధార్మిక కర్మల్లో స్థానం ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని గృహ్యకర్మల్లో భర్తతో పాటు భార్య కూడా గృహాగ్నికి ఉదయం, సాయంత్రం ఆహుతులు సమర్పించవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో భర్త, భార్యతో పాటు కుమారుడు, కుమార్తె లేదా శిష్యుడు కూడా గృహాగ్ని సేవలో పాల్గొనవచ్చని వివరిస్తున్నాయి..
అదే సమయంలో కొన్ని వైదిక యజ్ఞాలు, సంస్కారాలు, ఆగమపద్ధతిలో జరిగే ఆలయ పూజలకు ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. అలాంటి కర్మల్లో ఎవరు చేయాలి, ఏ మంత్రం ఎవరు ఉచ్చరించాలి, ఏ విధానం పాటించాలి అనేది ఆ సంప్రదాయాన్ని బట్టి మారుతుంది. కాబట్టి ఇంటి సాధారణ నిత్యపూజను.. ఆలయ అర్చక కర్మలతో ఒకటిగా చూడకూడదు.
ఇక భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా భగవంతుడికి సమర్పించే ద్రవ్యానికంటే భక్తినే ప్రధానంగా చెబుతాడు. భక్తితో సమర్పించిన ఆకు, పుష్పం, పండు లేదా నీటినైనా తాను స్వీకరిస్తానని 9వ అధ్యాయం 26వ శ్లోకంలో పేర్కొంటాడు. అందుకే ఇంట్లో నిత్యపూజ చేసే వ్యక్తి ముందుగా శరీరశుద్ధి, మనశ్శాంతి, పూజాస్థల పరిశుభ్రత పాటించడం ముఖ్యం. సాధ్యమైతే కుటుంబ సభ్యులు కలిసి దీపం వెలిగించడం, నామస్మరణ చేయడం, నైవేద్యం సమర్పించడం మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తుంది.
అదేవిధంగా పూజ ఏ సమయంలో చేయాలనే విషయానికి వస్తే.. ముఖ్యంగా ఉదయం అంటే సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలోని సమయం భగవంతుని ఆరాధనకు అనుకూలమైనదిగా భావిస్తారు. సాయంత్రం కూడా దీపారాధన, ప్రార్థనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వైదిక సంప్రదాయాల్లో ఉదయం, సాయంత్రం కూడా ఇంట్లో
ఈపాలు వెలిగించి ఆ భగవంతుణ్ణి ఆరాధించవచ్చు..
అయితే ఉదయం పూజ చేయలేని వారు.. తమకు అనుకూలమైన సమయంలో ప్రశాంతమైన మనసుతో భగవంతుడిని స్మరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక సాధారణంగా ఇంటి పెద్ద ఆ ఇంట్లో నిత్య దీపారాధన చేయాలని పండితులు అంటారు. వారికి వీలు అయిన కాకపోయినా ఆ ఇంటి గృహిణి సైతం నిత్య పూజకు అర్హురాలిగా మన సాంప్రదాయాలు చెబుతున్నాయి. కానీ వారికి మైల ఉన్న రోజులు మాత్రం మనసులో భగవంతుణ్ణి స్మరించుకోవాలని సూచిస్తున్నారు.
అందువల్ల ఇంట్లో పూజ మగవారు మాత్రమే చేయాలి, ఆడవారు మాత్రమే చేయాలి అనే కఠినమైన నియమాన్ని నిత్యపూజకు వర్తింపజేయడం సరైంది కాదు. కుటుంబ సంప్రదాయం, ఆచారం, ఆరాధించే దేవతకు సంబంధించిన విధానం ఏదైతే ఉందో.. దానిని గౌరవిస్తూ, శ్రద్ధతో, శుచిగా, నియమబద్ధంగా చేసే పూజకే ఆధ్యాత్మిక విలువ ఉంటుందని చెబుతున్నారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












