తెలంగాణ

Telangana: బీసీ ఓటు బ్యాంక్‌పై టీడీపీ కన్ను.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?..

రచన: Venu••9 నిమిషాల పఠనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా బలహీన పడి తన ఉనికిని కోల్పోయింది.

తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు మొదలయ్యాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా బలహీన పడి తన ఉనికిని కోల్పోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేసి 15 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ బలం కూడా నిలబడలేదు. 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్‌లో చేరడంతో 2016 నాటికే అసెంబ్లీలో టీడీపీ బలం మూడు స్థానాలకు పడిపోయింది.

ఆ తర్వాత తెలంగాణలో టీడీపీకి చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను టీడీపీ ఒక్క డివిజన్‌లో మాత్రమే గెలిచింది. ఒకప్పుడు హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఉన్న టీడీపీ క్యాడర్ కూడా కాలక్రమంలో ఇతర పార్టీల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటం, అక్కడ బీజేపీ–జనసేనతో కలిసి ఎన్డీఏలో కొనసాగుతుండటంతో తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించినట్టు టాక్ వినిపిస్తుంది..

ఈ క్రమంలో పాత క్యాడర్‌ను మళ్లీ కూడగట్టడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ఉన్న పాత పరిచయాలను తిరిగి యాక్టివ్ చేయడం వంటి అంశాలపై టీడీపీ దృష్టి పెడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు జనవరి 2026లో తెలంగాణ టుడే కథనం కూడా టీడీపీ, జనసేన తెలంగాణలో తమ కార్యకలాపాలను పెంచేందుకు మున్సిపల్ ఎన్నికలను ఒక అవకాశంగా చూస్తున్నాయని పేర్కొంది.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ఉన్న బలాన్ని తెలుసుకోవడం, స్థానిక స్థాయిలో నాయకత్వాన్ని తయారు చేయడం వంటి అంశాలపై రెండు పార్టీలు దృష్టి పెట్టినట్టు ఆ కథనం వెల్లడించింది. ఇక టీడీపీ తెలంగాణలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో బీసీ నాయకత్వం అంశం కూడా చర్చకు వస్తోంది. ఎన్టీఆర్ హయాం నుంచి బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చిన పార్టీగా టీడీపీకి ఒక గుర్తింపు ఉంది.

తెలంగాణలో కూడా బీసీ రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చ పెరుగుతున్న సమయంలో.. అదే అంశాన్ని పార్టీ విస్తరణకు ఉపయోగించుకోవాలనే ఆలోచన టీడీపీకి ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతల్లో బీసీ వర్గాలకు చెందిన వారిని టీడీపీ వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందనే టాక్ ఉంది. అయితే ఇప్పటివరకు ఏ నాయకుడితో సంప్రదింపులు జరుగుతున్నాయి, ఎవరిని పార్టీలోకి తీసుకురాబోతున్నారు అనే దానిపై సమాచారం బయటికి రాలేదు..

ఇక టీడీపీతో పాటు జనసేన కూడా తెలంగాణలో తన కార్యకలాపాలను పెంచుతోంది. 2026లో తెలంగాణలో పార్టీని మళ్లీ ఏర్పాటు చేసి, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో టీడీపీ, జనసేన కలిసి తెలంగాణలో పనిచేసే అవకాశాలపై కూడా చర్చ మొదలైంది.

ఏపీలో ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇదే తరహా రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూటమి ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఎన్నికల పొత్తు లేదా సీట్ల సర్దుబాటుపై ఎలాంటి ప్రకట బయటికి రాలేదు.. కానీ తెలంగాణలో టీడీపీ–బీజేపీ–జనసేన కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయనే ప్రచారం మాత్రం జోరందుకుంది.

మరోవైపు టీడీపీకి తెలంగాణలో రాజకీయ ప్రయాణం కొత్తగా మొదలుపెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ.. పార్టీకి గతంలో పనిచేసిన క్యాడర్, పాత నాయకుల నెట్‌వర్క్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్ ప్రాంతాల్లో టీడీపీకి గతంలో మంచి రాజకీయ ప్రాతినిధ్యం ఉండేది. 2014లో పార్టీ గెలిచిన అసెంబ్లీ స్థానాల్లోనూ ఈ ప్రాంతాల ప్రభావం కనిపించింది.

అందుకే తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను పెంచితే మొదట ఈ ప్రాంతాలపైనే దృష్టి పెట్టే అవకాశం ఉందనే చర్చ ఉంది. పట్టణ ప్రాంతాల్లో పాత క్యాడర్‌ను మళ్లీ కలుపుకోవడం, గ్రామస్థాయిలో కొత్త నాయకులను తయారు చేయడం, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీసీ నాయకత్వం విషయంలో కూడా టీడీపీకి ఒక ప్రత్యేక రాజకీయ లైన్ ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

కులగణన, బీసీ రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ప్రధాన చర్చగా ఉన్నాయి. ఈ అంశాలపై బీసీ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని టీడీపీ కూడా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీసీ నాయకత్వం, జనసేనతో సమన్వయం, బీజేపీతో రాజకీయ సంబంధాలు.. ఈ మూడు అంశాలు కూడా తెలంగాణలో టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, కాంగ్రెస్ ఈ పొత్తును ఆంధ్ర పార్టీ మళ్ళీ మనకెందుకు? అనే సెంటిమెంట్ కోణంలో ప్రచారం చేసేందుకు సిద్ధమైతే.. వారి ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు టీడీపీ ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుందనే ప్రచారం బలపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకువస్తే, రాష్ట్రంలో ఊహించని కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా, మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ సామాజిక వర్గాలను తమవైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థుల ప్రాంతీయ సెంటిమెంట్ రాజకీయాన్ని గట్టిగా దెబ్బతీయవచ్చని టీడీపీ భావిస్తోందని చెప్పుకొంటున్నారు. స్థానిక నేతలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజాసమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా గ్రామీణ స్థాయిలో పట్టు సాధించేందుకు సైతం ప్రణాళికలు రచిస్తోందని చర్చించుకుంటున్నారు..

ఇక ఈ కొత్త సామాజిక సమీకరణాల వ్యూహం.. ప్రత్యర్థి పార్టీల సాంప్రదాయ ఓటు బ్యాంకులకు గట్టి సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరి, ఈ బీసీ కార్డ్ ఎత్తుగడ తెలంగాణ రాజకీయ చిత్రాన్ని ఏ మలుపు తిప్పుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాలి!..

#Telangana#TDP#bjp#janasena#BC vote bank#Chandrababu strategy#Hyderabad#Ranga Reddy#Khammam#Mahabubnagar#Warangal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి