ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రాణాలను బలిగొంది. హన్మకొండలో పీజీ (పీడియాట్రిషన్) మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన కె.సృజన (27) అనే విద్యార్థిని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న ఓ హోటల్ గదిలో దారుణ హత్యకు గురైంది. పథకం ప్రకారమే ఆమెను హోటల్‌కు పిలిపించిన నిందితుడు, దిండుతో ముఖంపై నొక్కి ఊపిరాడకుండా చేసి దారుణంగా కడతేర్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడేళ్ల క్రితం సృజనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవికుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయంతోనే కొంతకాలం క్రితం సృజన వద్ద నుంచి అతడు ఒక బంగారు గొలుసును తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 29వ తేదీన మియాపూర్‌లోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్న రవికుమార్.. ‘నీ బంగారు గొలుసు తిరిగి ఇచ్చేస్తాను.. హోటల్‌కు రా’ అని సృజనను నమ్మించి రప్పించాడు.
దీంతో సెప్టెంబర్ 30వ తేదీన సృజన అతడిని కలవడానికి మియాపూర్ హోటల్‌కు వెళ్లింది. అయితే, సృజన రెండు రోజులైనా తిరిగి రాకపోవడం, ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు వెంటనే ఆమె తండ్రికి సమాచారం అందించారు. ఆందోళన చెందిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు సృజన సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా మియాపూర్‌లోని సదరు హోటల్‌ను గుర్తించారు.
పోలీసులు హోటల్ గది తలుపులు తెరిచి చూడగా, సృజన మంచంపై విగతజీవిగా పడి ఉంది. హత్య అనంతరం నిందితుడు రవికుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. సృజన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, హోటల్ సీసీ ఫుటేజీ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడు రవికుమార్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


