ప్రపంచంలోనే అత్యంత రమణీయమైన పర్యాటక ప్రాంతమైన స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణులు పర్యావరణ మార్పుల కారణంగా తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. శీతాకాలంలో తెల్లటి మంచు దుప్పటి కప్పుకుని పర్యాటకులను పరవశింపజేసే స్విస్ గ్లేసియర్లు చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా కరిగిపోతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 'స్విస్ గ్లేసియర్ మానిటరింగ్ నెట్‌వర్క్ (గ్లామోస్)', 'స్విస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' ప్రచురించిన తాజా పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గడిచిన ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే స్విట్జర్లాండ్ తన పర్వతాలపై ఉన్న మంచులో ఏకంగా 20శాతాన్ని శాశ్వతంగా కోల్పోయింది.

ఈ విపత్కర వాతావరణ మార్పుల తీవ్రతకు కేవలం ఈ ఒక్క ఏడాదే రికార్డు స్థాయిలో 5 శాతానికి పైగా మంచు కరిగిపోయినట్లు పరిశోధనలో వెల్లడైంది. జూలై నుంచి సెప్టెంబర్ నెలల వ్యవధిలోనే ఆల్ప్స్ పర్వతాల నుంచి సుమారు 2.2 లక్షల కోట్ల లీటర్ల మంచు నీరు నదుల్లోకి వచ్చి చేరిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిమాణం స్విట్జర్లాండ్ ప్రజల నాలుగు సంవత్సరాల తాగునీటి అవసరాలకు సరిపోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
యూరప్ ఖండంలో నమోదవుతున్న అసాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగానే చిన్న తరహా గ్లేసియర్లు ఇప్పటికే పూర్తిగా అదృశ్యమవ్వగా, పెద్ద హిమనీనదాలు కూడా రోజురోజుకూ వేగంగా కరిగిపోతున్నాయి. ఆల్ప్స్ పర్వతాల్లోని 23 ప్రధాన గ్లేసియర్లపై జరిపిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా హిమనీనదాల మందం సగటున 8 నుంచి 13 అడుగుల వరకు పడిపోయింది. ఈ గ్లేసియర్ల క్షీణత కేవలం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా స్విస్ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది.

స్విట్జర్లాండ్‌లో ప్రధాన ఆదాయ వనరులైన స్కీయింగ్, శీతాకాల పర్యాటకం, పర్వతారోహణ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడటంతో పాటు దేశ విద్యుదుత్పత్తిలో కీలకమైన జల విద్యుత్ కేంద్రాలకు నీటి కొరత ఏర్పడి ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశముంది. పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను నియంత్రించకపోతే, 2,100 నాటికి స్విట్జర్లాండ్‌లోని 90శాతానికి పైగా హిమనీనదాలు పూర్తిగా కనుమరుగైపోతాయని అంచనా వేస్తున్నారు. భూతాపం వల్ల పెరిగే ప్రతి 0.1డిగ్రీల ఉష్ణోగ్రత కూడా పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తుందని, ఇది ఒక్క స్విట్జర్లాండ్ సమస్య మాత్రమే కాదని ప్రపంచ దేశాలన్నీ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


