సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఇల్లు లేని వారికి ఉండే కల.. ఇందుకోసం ఎన్నో తిప్పలుపడి చివరికి నూతన గృహాన్ని నిర్మించుకుంటారు. అలా ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే రోజు ప్రతి కుటుంబానికీ ఎంతో ప్రత్యేకమైనది. అందుకే మన సంప్రదాయంలో గృహప్రవేశానికి ఒక మంచి రోజు, మంచి సమయం చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో గృహప్రవేశం చేయాలని కొందరు పండితులు సూచిస్తుంటారు.
అసలు ఈ సమయానికే ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారు? దీనికి మన శాస్త్రాల్లో ఉన్న వివరణ ఏంటి అనేది ఆసక్తికరమైన విషయం.. ఇక బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు ఉండే పవిత్రమైన సమయం. సాధారణంగా సూర్యోదయానికి దాదాపు గంటన్నర ముందు ప్రారంభమయ్యే ఈ కాలాన్ని మన ధర్మశాస్త్ర సంప్రదాయంలో ప్రశాంతమైన, సాత్త్వికమైన సమయంగా భావిస్తారు.
ఈ సమయం జపం, ధ్యానం, వేదాధ్యయనం, దేవతారాధన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలమని భావించడమే ఇందుకు కారణమని పండితులు చెబుతున్నారు. అయితే నూతన గృహప్రవేశానికి సంబంధించిన వివరాలు ప్రధానంగా వాస్తు, ముహూర్త, జ్యోతిష సంప్రదాయాల్లో కనిపిస్తాయి. ప్రాచీన వాస్తు గ్రంథమైన మానసారంలో గృహప్రవేశానికి ప్రత్యేకంగా ఒక అధ్యాయమే ఉంది.
ఇందులో కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు శుభమైన తిథి, నక్షత్రం, లగ్నం, పక్షం వంటి అంశాలను పరిశీలించాలని చెబుతుంది. అంటే గృహప్రవేశానికి కేవలం ఒకే సమయాన్ని కాకుండా పంచాంగంలోని అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నది ఈ సంప్రదాయం. అలాగే వరాహమిహిరుడి బృహత్సంహితలో వాస్తు సంబంధమైన విషయాలను వివరిస్తూ గృహ నిర్మాణం, ఇంటిలో ప్రవేశం, దేవతా పూజ వంటి ఆచారాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
కొత్త ఇంటిలోకి అడుగుపెట్టే ముందు శుభకార్యాలు, పూజలు నిర్వహించి, మంత్రోచ్చారణల మధ్య ప్రవేశించే సంప్రదాయం కూడా ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి. ఈ సమయం ప్రకృతి ప్రశాంతంగా ఉండే వేళ. మనసు కూడా ప్రశాంతంగా ఉండే సమయంగా ఆధ్యాత్మిక సంప్రదాయం భావిస్తుంది. అందుకే కొత్త ఇంటిలో మొదటి అడుగు కూడా ప్రశాంతత, పవిత్రత, దేవుని స్మరణతో ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ సమయాన్ని కొందరు ఎంచుకుంటారు.
అయితే గృహప్రవేశం విషయంలో బ్రహ్మ ముహూర్తం ఒక్కటే ప్రమాణం కాదు. కుటుంబ సంప్రదాయం, ఆచార విధానం, తిథి, నక్షత్రం, లగ్నం, పంచాంగ పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించి పండితులు ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అందుకే నూతన గృహప్రవేశం సమయంలో వేసే తొలి అడుగు శుభంగా ఉండాలి.. ఆ ఇంటిలోకి సానుకూలత, శాంతి, ఐశ్వర్యం ప్రవేశించాలనే సంకల్పంతో దేవుని స్మరించి కొత్త ఇంట్లోకి ప్రవేశించాలని మన సనాతన సంప్రదాయంలో చెబుతారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












