Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ‘ఫెవికాల్ బ్యాచ్’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పదవిలో ఉన్నన్నాళ్లూ అధికారం అనుభవించిన కొందరు నేతలు.. పదవీ కాలం ముగిసి మాజీలుగా మారినా కుర్చీలను వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నారట. "పదవి పోయినా పవర్ మాదే.. కుర్చీ పోయినా పెత్తనం మాదే" అన్నట్లుగా వ్యవహరిస్తూ కార్పొరేషన్లలో ఇంకా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మాజీలు అయ్యాక కూడా ప్రజాధనంతో దర్జాగా జల్సాలు చేస్తూ, అధికారిక హోదాల్లో తిరుగుతున్నారన్న విమర్శలు ఇప్పుడు సచివాలయ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
మాజీలైనా.. తాజాలమన్నట్టే పెత్తనం!
తెలంగాణలోని పలు కార్పొరేషన్లలో చైర్మన్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. సాధారణంగా పదవీ విరమణ పొందాక ఎవరైనా హుందాగా తప్పుకోవడం ఆనవాయితీ. కానీ, కొందరు మాజీ చైర్మన్లు మాత్రం కుర్చీలకు ఫెవికాల్ పూసుకుని అతుక్కుపోయారా అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
పదవిలో ఉండగానే మంత్రులు తమను పెద్దగా పట్టించుకోలేదని, అధికారులు తాము చెప్పిన పనులు సరిగా చేయలేదని అప్పట్లో వాపోయిన నేతలు.. ఇప్పుడు కుర్చీ దిగిపోయాక కూడా ఆ అధికారిక దర్పం, ఆ ‘వాసనలు’ వదులుకోవడానికి ఇష్టపడకపోవడం విడ్డూరంగా మారింది. కార్పొరేషన్ కార్యాలయాల్లో ఇంకా తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండటంతో, "పదవిలో ఉన్నప్పుడే పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు కుర్చీ లేనప్పుడు అసలు లెక్క చేస్తారా?" అని స్వయంగా సహచర నాయకులే సెటైర్లు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో తమకే రెన్యూవల్ దక్కుతుందన్న ధీమాతోనే కొందరు నేతలు ఈ విధంగా కుర్చీల కోసం పాకులాడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
రచ్చకెక్కుతున్న విదేశీ పర్యటన
ఇలాంటి సమయంలోనే మరో వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SAT) మాజీ చైర్మన్ శివసేనా రెడ్డి కూడా వెళ్లడం చర్చకు దారితీసింది. పదవీ కాలం ముగిసి మాజీగా మారిన తర్వాత కూడా ఆయన అధికారిక విదేశీ పర్యటనకు ఎలా వెళ్తారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీనిపై అధికారుల నుంచి మరో వివరణ వినిపిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా ఎంపిక చేసిన బృందంలోనే మాజీ చైర్మన్‌గా ఆయనకు చోటు కల్పించారని, ఆ కమిటీ సభ్యుడి హోదాలోనే ఆయన జపాన్ వెళ్లారని చెబుతున్నారు.
అధికార రుచి మరిగితే అంతేనా?
ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు "ఎంతైనా అధికారం కదా.. ఆ టేస్ట్ తెలిశాక అంత ఈజీగా వదులుకోవడం కష్టమేలే" అంటూ చమత్కరిస్తున్నారు. అయితే పెత్తనాలు చలాయించేందుకు, విదేశీ పర్యటనలకు ఖర్చు పెడుతున్నది అంతిమంగా ప్రజల సొమ్మే అన్న విషయాన్ని సదరు నేతలు గుర్తుంచుకోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు చురకలు అంటిస్తున్నాయి. పదవి ముగిసిన తర్వాత కూడా హోదా కోసం పాకులాడటం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మసులుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.


