తెలంగాణ

Telangana Politics: అంగట్లో నామినేటెడ్ పోస్టులు.. సొసైటీ చైర్మన్ పీఠానికి రూ.20 లక్షల రేటు!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

రాజకీయాల్లో పదవి అంటే ప్రజాసేవకు దక్కిన గుర్తింపు. పార్టీ కోసం చెమటోడ్చిన కార్యకర్తలకు దక్కే గౌరవం. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మాత్రం పదవులంటే పక్కా కమర్షియల్ బిజినెస్‌గా మారిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. "క్యాష్ కొట్టు.. కుర్చీ పట్టు.. ఆలసించిన ఆశాభంగం" అన్నట్లుగా అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం సాగుతోందని ఆ పార్టీ నాయకలే చెబుతున్నారు.

Telangana Politics : రాజకీయాల్లో పదవి అంటే ప్రజాసేవకు దక్కిన గుర్తింపు. పార్టీ కోసం చెమటోడ్చిన కార్యకర్తలకు దక్కే గౌరవం. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మాత్రం పదవులంటే పక్కా కమర్షియల్ బిజినెస్‌గా మారిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. "క్యాష్ కొట్టు.. కుర్చీ పట్టు.. ఆలసించిన ఆశాభంగం" అన్నట్లుగా అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం సాగుతోందని ఆ పార్టీ నాయకలే చెబుతున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ సిద్ధాంతాలు పక్కనపెట్టి, ప్రతీ నామినేటెడ్ పోస్టుకూ బహిరంగంగానే రేటు కట్టి అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టారన్న ఆరోపణలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో సంచనలంగా మారింది.

రైతుల సొసైటీలు.. వ్యాపారులకు వేలంపాట

రైతాంగానికి అండగా ఉండాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలే సదరు ఎమ్మెల్యేకు కాసుల పంట పండిస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రంలోని కీలక సొసైటీ చైర్మన్ పీఠానికి ఏకంగా రూ.20 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. డైరెక్టర్, చైర్మన్ పదవులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పిన వాళ్లకే ఆర్డర్లు చేతికొచ్చాయన్నది బహిరంగ రహస్యం.

ఆ నియోజకవర్గ పరిధిలో మొత్తం 12 సొసైటీలు ఉండగా, ఇప్పటివరకు ఎన్నికలు పూర్తయిన 6 సొసైటీల చైర్మన్ పీఠాలన్నీ డబ్బున్న వ్యాపార వర్గాలకే దక్కాయి. వ్యవసాయం, సహకార రంగంతో కనీస సంబంధం లేని వ్యాపారస్తులు చైర్మన్ కుర్చీల్లో కూర్చోవడానికి కారణం కేవలం సంచుల కొద్దీ సమర్పించిన ముడుపులేనని సొంత పార్టీ శ్రేణులే బాహాటంగా చర్చించుకుంటున్నాయి. నిజమైన రైతులు, ఏళ్ల తరబడి పనిచేసిన సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అభివృద్ధి పనుల్లో 5% కట్..

పదవుల అమ్మకం మాత్రమే కాదట.. నియోజకవర్గానికి వచ్చే నిధుల్లోనూ ఎమ్మెల్యే మార్కు వసూళ్లు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద మంజూరయ్యే ప్రతి పని ప్రొసీడింగ్స్ బయటకు రావాలంటే ముందుగా 5 శాతం కమీషన్ సమర్పించుకోవాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే కొడుకు పెత్తనం మితిమీరిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ట్రాన్స్‌ఫర్లు, కాంట్రాక్టులు, పైరవీలు ఏవి కావాలన్నా ‘చినబాబు’ ఆశీస్సులు, ఆయన నిర్ణయించిన నజరానాలు ముట్టాల్సిందేనని అధికారులు, పార్టీ నాయకులు వాపోతున్నారు.

గాంధీభవన్‌‌కు పంచాయితీ..

గడిచిన పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసుల లాఠీదెబ్బలు తిని, జైళ్లకు వెళ్లి, సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టుకుని జెండా మోసిన నిఖార్సయిన కార్యకర్తలు ఇప్పుడు నిలువునా మోసపోతున్నామని లబోదిబోమంటున్నారు. నాడు పార్టీని పట్టించుకోని, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి కప్పం కట్టిన కొత్త ముఖాలకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో సొంత బలం లేకపోయినా కేవలం కాంగ్రెస్ వేవ్‌లో గెలిచిన ఈ ఎమ్మెల్యే.. "ఈ అవకాశం మళ్లీ రాదు, ఉన్నప్పుడే అందినకాడికి వెనకేసుకోవాలి" అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఈ ‘క్యాష్ అండ్ క్యారీ’ రాజకీయంపై విసిగిపోయిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై పక్కా ఆధారాలతో అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకపోతే, వచ్చే ఎన్నికల్లో ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చినా గెలుపు ఆశలు వదులుకోవాల్సిందేనని క్షేత్రస్థాయి క్యాడర్ హెచ్చరిస్తోంది.

#Telangana Politics#Telangana Congress#Warangal Politics#Congress MLA#Political Allegations#PACS Elections#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి