TG: ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు ఎగ్గొడుతూ టైం పాస్ చేస్తున్న అక్రమ రైస్ మిల్లర్లపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ గట్టిగా జవాబు చెప్పడానికి రెడీ అయ్యింది. ప్రజాధనంతో కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని దారిమళ్లించినా, సీఎంఆర్ ధాన్యం లెక్క తేల్చకపోయినా ఇకపై ఊరుకునేది లేదని ప్రభుత్వం స్పష్టమైన వార్నింగ్ ఇచ్చింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం ద్వారా మిల్లర్ల ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు పక్కా ప్లాన్ రెడీ చేశారు.
ఈ సరికొత్త ప్రణాళిక ప్రకారం.. గోదాముల్లో తనిఖీలు నిర్వహించి ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. సమాధానం ఇచ్చేందుకు కేవలం 7 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఆ గడువులోగా రెస్పాన్స్ లేకపోతే జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో మిల్లులు, యంత్రాలు, వాహనాలు, బ్యాంకు ఖాతాలను వెంటనే సీజ్ చేస్తారు. ప్రభుత్వం నష్టపోయిన మొత్తం రాబట్టుకోలేకపోతే మిల్లర్ల ఇళ్లు, వ్యవసాయ భూములను సైతం స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేసేందుకు అధికారులు రంగంలోకి దిగుతోంది.
ఈ చర్యలు న్యాయపరంగా తిరుగులేకుండా ఉండేందుకు అక్టోబర్ 5, 2026 నుంచి డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో అధికారులకు ప్రత్యేక ట్రైనింగ్‌ను కూడా స్టార్ట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంచనామాలు, వీడియో సాక్ష్యాల సేకరణ మొదలుకొని బకాయిల లెక్కింపు, రెవెన్యూ విభాగంతో సమన్వయం వరకు అధికారులకు పక్కాగా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకునే మిల్లర్ల మెడకు ఉచ్చు బిగిసినట్లయింది.


