Tollywood: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి కలిలి చేయబోతున్న ఆర్సీ17పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో.. ఇప్పుడు ఆర్సీ17పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. అక్టోబర్ 20న ఆర్సీ17 పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఈ ముహూర్తపు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘రంగస్థలం’ తర్వాత మరోసారి..
రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి రేకెత్తుతోంది. దీనికి కారణం వీరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’. ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చరణ్‌ను సుకుమార్ చూపించిన తీరు ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఈసారి మాత్రం పూర్తిగా కొత్త కథ, కొత్త పాత్ర, కొత్త ప్రపంచంతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.
ఆర్సీ17 కథ, బ్యాక్‌డ్రాప్, చరణ్ లుక్‌పై ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మేకర్స్ అధికారికంగా కథ గానీ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను గానీ ఇప్పటి వరకూ వెల్లడించలేదు. దీంతో, ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
దసరా సెంటిమెంట్‌తో ప్రారంభం?
కాగా, అక్టోబర్ 20న విజయదశమి కావడంతో, అదే రోజున సినిమాను ప్రారంభించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించి.. ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సుకుమార్ నుంచి మరో భారీ ప్రయోగమా?
‘పుష్ప’ ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను పెంచుకున్న సుకుమార్.. ఇప్పుడు చరణ్‌తో చేయబోయే సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండొచ్చనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
అంతేకాదు.. ఆర్సీ17 కోసం మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా కొత్త కాంబినేషన్‌పై చర్చ జరుగుతోంది. శాశ్వత్ సచ్‌దేవ్, అనిరుధ్ రవిచందర్ వంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. దాదాపుగా, ఈ సారి దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ సినిమాకి వర్క్ చేయకపోవచ్చుననే మాట మాత్రం బలంగా వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించనున్నాయి.







