తెలంగాణ

TG: బీఆర్ఎస్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ పాలిటిక్స్‌.. డ్యామేజ్ కంట్రోల్ కోసమేనా?

రచన: Mahesh5 నిమిషాల పఠనం

TG: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘సెంటిమెంట్’ అస్త్రం తెరపైకి వచ్చింది. ఉద్యమ కాలం నుంచి పార్టీని నడిపించిన ప్రధాన భావోద్వేగాలను గులాబీ దళం మళ్లీ రాజేసే పనిలో పడినట్లు కనిపిస్తుంది.

TG: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘సెంటిమెంట్’ అస్త్రం తెరపైకి వచ్చింది. ఉద్యమ కాలం నుంచి పార్టీని నడిపించిన ప్రధాన భావోద్వేగాలను గులాబీ దళం మళ్లీ రాజేసే పనిలో పడినట్లు కనిపిస్తుంది. అయితే ఈసారి ఈ అంశం తెరపైకి రావడం వెనుక కేవలం ప్రజా సమస్యలే కారణమా? లేక వరుస ఆరోపణలతో ఇరుకున పడ్డ పార్టీని గట్టెక్కించే సరికొత్త డ్యామేజ్ కంట్రోల్ వ్యూహమా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది.

భూముల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి

గత కొద్ది రోజులుగా రాజధాని శివార్లలోని చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధుల్లో అక్రమ నిర్మాణాలు, ఫామ్‌హౌస్‌ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్‌తో పాటు క్షేత్రస్థాయి యంత్రాంగం దూకుడు పెంచడంతో గులాబీ కీలక నేతలపై భూ కబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. సదరు ఆస్తులు, భూములకు సంబంధించిన వివాదాల్లో సరైన పత్రాలతో క్లారిటీ ఇవ్వలేక, డిఫెన్స్‌లో పడ్డ నేతలు ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతిరోజూ మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ఫాంహౌస్‌ల చుట్టూనే చర్చ నడుస్తుండటంతో బీఆర్ఎస్ క్యాడర్‌లోనూ గందరగోళం మొదలైంది.

తెరపైకి హరీశ్ రావు ఎంట్రీ

ఈ ఇరకాటం నుంచి బయటపడటానికి, ప్రజా దృష్టిని ఇతర వైపు మళ్లించేందుకు తాజాగా బీఆర్‌ఎస్ పాత అస్త్రాన్నే నమ్ముకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మాజీ మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి కృష్ణా నది జలాల అంశాన్ని హాట్ టాపిక్‌గా మార్చారనే ప్రచారం జోరందుకుంది. "పక్కనే ఉన్న పాలమూరు ఎండిపోతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. ఆంధ్రాలోని కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తరలిస్తుంటే ఏం చేస్తోంది?" అంటూ ఆయన లేవనెత్తిన ప్రశ్నలు రాష్ట్రంలో సరికొత్త వాదోపవాదాలకు తెరతీశాయి. సరిహద్దు ప్రాజెక్టుల వద్దకు నేరుగా వెళ్లి హడావుడి చేయడం, మీడియా ముందు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం వెనుక బలమైన వ్యూహమే దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డైవర్షన్ పాలిటిక్స్ వర్కవుట్ అవుతాయా

ఉద్యమ కాలం నుంచి ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన 'నీళ్లు-నిధులు-నియామకాలు' నినాదంలో నీళ్ల అంశం అత్యంత సున్నితమైనది. ఆ సెంటిమెంట్‌ను మళ్లీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా.. ప్రస్తుతం మెడకు చుట్టుకున్న భూ కబ్జాల నిందల నుంచి తప్పించుకోవచ్చని గులాబీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. భూముల అంశాన్ని డైవర్ట్ చేసి, ప్రాంతీయ విద్వేషాలు, నీళ్ల హక్కుల చుట్టూ పొలిటికల్ డిబేట్‌ను మార్చడమే లక్ష్యంగా ఈ వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రజలు ఈ డైవర్షన్ పాలిటిక్స్‌ను ఎంతవరకు నమ్ముతారు? వరుస భూ ఆరోపణల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు ఈ నీళ్ల సెంటిమెంట్‌తో గట్టెక్కగలదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

#BRS#Telangana Politics#Harish Rao#Krishna River Water#Water Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి