TG : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తం అయ్యింది. రాబోయే 48 గంటలు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
ఆ ఎనిమిది జిల్లాలపై తీవ్ర ప్రభావం.. హైఅలర్ట్
రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల ముప్పు ఎక్కువగా పొంచి ఉన్న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగాన్ని అత్యంత అప్రమత్తంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు సహాయక చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా..
వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షణక్షణం నిఘా ఉంచాలని అధికార బృందాలను మంత్రి ఆదేశించారు. ప్రమాదకర స్థాయికి చేరిన లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక బలగాలను సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
24 గంటలూ కంట్రోల్ రూమ్స్.. టోల్‌ఫ్రీ నంబర్లు
బాధిత ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసే కంట్రోల్ రూమ్‌లను, ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఏ క్షణంలోనైనా వరద లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే వచ్చే ఫోన్ కాల్స్‌పై అధికారులు క్షణాల్లో స్పందించేలా సమన్వయ వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
పరిస్థితి ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తుండటంతో ప్రజలు కూడా స్వీయ రక్షణ చర్యలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఉద్ధృతంగా ప్రవహించే వాగులు, కల్వర్టులు, చెరువులు దాటే సాహసం అస్సలు చేయవద్దని హెచ్చరించారు. రాగల 48 గంటలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.








