BJP: దేశవ్యాప్తంగా సంస్థాగత యంత్రాంగాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో బీజేపీ నాయకత్వం కీలక కార్యాచరణను చేపట్టింది. జాతీయ కార్యవర్గ సభ్యులకు వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తూ కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తాజాగా ప్రకటన రిలీజ్ చేశారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా ఇన్‌ఛార్జిలు, కో-ఇన్‌ఛార్జిల పేర్లను ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకులను నియమించారు.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్ బాధ్యతల్లో సునీల్ భన్సల్
రాజకీయ వ్యూహాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత సునీల్ భన్సల్‌ను తెలంగాణ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ పార్టీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను కూడా ఆయనకే కేటాయించారు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, సమన్వయంపై దృష్టి సారించే క్రమంలో భన్సల్ అనుభవం రెండు రాష్ట్రాల్లో కీలకంగా మారనుంది.
ఏపీ ఇన్‌ఛార్జిగా అరవింద్ భదౌరియా.. ఒడిశాకు పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అరవింద్ భదౌరియాను ఇన్‌ఛార్జిగా నియమించారు. మరోవైపు ఏపీ బీజేపీ సీనియర్ నేత, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
స్మృతి ఇరానీకి రెండు రాష్ట్రాలు.. ఢిల్లీకి వినయ్ సహస్రబుద్ధే
జాతీయ స్థాయి కీలక నేత స్మృతి ఇరానీకి హరియాణా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పర్యవేక్షణ బాధ్యతలను కట్టబెట్టారు. ఢిల్లీ ఇన్‌ఛార్జిగా వినయ్ సహస్రబుద్ధేను రంగంలోకి దించారు. వీటితో పాటు తమిళనాడు, కర్ణాటక, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జిల జాబితాను ఖరారు చేశారు.
మరోవైపు పార్టీ సమాచార వ్యవస్థను సమన్వయం చేసే కమ్యూనికేషన్ సెల్ కో-ఆర్డినేటర్‌గా అనిల్ బలూని, కన్వీనర్‌గా ఆశిష్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ రాజకీయ కార్యాచరణలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధిష్ఠానం ఈ కీలక నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.









