Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. వాటర్ మేనేజ్‌మెంట్‌లో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. కమీషన్ మేనేజ్‌మెంట్‌లో మాత్రం సక్సెస్ అయ్యిందని విమర్శలు చేశారు. 30శాతం కమీషన్ మేనేజ్ మెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరితేరిందని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ కు తెలిసింది రెండే.. 30శాతం కమీషన్లు తీసుకోవడం లేదా ప్రతిపక్షాల మీద కమిషన్లు వేయడం అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
కరవు వచ్చిందని ప్రజలను మోసగిస్తున్నారు
తెలంగాణ ప్రజలను కాపాడటమా? ఏపీకి నీళ్లు వదలడమా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? అని తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కరవు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారు... నిజానికి కరవు రాలేదు.. మీరు నీళ్లు ఎత్తక ఆంధ్రా వాళ్లు తీసుకుపోతున్నారు అని హరీశ్ రావు పేర్కొన్నారు.
పెద్ద మోటార్లు దెబ్బతింటున్నాయి
పెద్ద మోటార్లు ఆన్ ఆఫ్ చేయొద్దని.. నిరంతరాయంగా మోటార్లు నడపాలని ఇంజినీరింగ్ నిపుణులు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీశ్ రావు మండిపడ్డారు. పెద్ద మోటార్లు ఆన్ ఆఫ్ చేస్తే వాటి బేరింగ్స్ దెబ్బ తింటాయి, పంపులు దెబ్బతింటాయి, మోటార్ల లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని ఇంజినీరింగ్ నిపుణులు అనేక మార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారని హరీశ్ రావు గుర్తు చేశారు. అయినా ఈ ప్రభుత్వం ఆన్ అండ్ ఆఫ్ లో మోటార్లు నడిపి వాటి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల ఇప్పటికే కల్వకుర్తిలో ఒక మోటార్ కాలిపోయిందని తెలిపారు.
''ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ ఇంజినీర్లు, ప్రభుత్వ సలహాదారులు ఆన్ అండ్ ఆఫ్ లో పెద్ద మోటార్లు నడపొద్దు, నిరంతరాయంగా మోటార్లు నడపాలని చెప్పినా ప్రభుత్వం వినలేదు. పొద్దున సాయంత్రం ఆన్ ఆఫ్ చేయడం వల్ల మోటార్ల కెపాసిటీ దెబ్బతింటోంది, మోటార్లు కాలిపోతున్నాయి. భవిష్యత్తులో జిల్లాకు, ఇరిగేషన్ శాఖకు, రైతులకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది'' అని హరీశ్ రావు హెచ్చరించారు.
''కృష్ణా నదిలో వచ్చిన జలాల్లో తెలంగాణకు 34శాతం వాటా వాడుకునే హక్కు ఉంది. కానీ ఈ అసమర్థ ప్రభుత్వం అది కూడా వాడుకోలేకపోతోంది. కేవలం 24శాతం మాత్రమే నీరు వాడింది'' అని హరీశ్ రావు అన్నారు.
ఇది రేవంత్ రెడ్డి తెచ్చిన కరవు
''ఎల్ నినో వల్ల వచ్చిన కరవు కాదు ఇది. రేవంత్ రెడ్డి తెచ్చిన కరవు. కాలం తెచ్చిన కరవు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరవు. గోదావరిలో రోజు 10 మోటార్లు నడిపగలిగే అవకాశం ఉంటే.. 8 గంటలు మాత్రమే నడపటం అంటే.. కరవు గోదావరి నదిలో లేదు, కరవు కాంగ్రెస్ లో ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం.. కరెక్ట్ గా చేస్తే 3 నెలల పనే. మూడు నెలల్లో పూర్తి చేసే పనిని మూడేళ్లైనా చేయలేదు. ఇప్పుడు కూడా శ్రీశైలంలో మనకు 56 టీఎంసీల నీళ్లు ఎత్తగలిగే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ పాలమూరుకు ద్రోహం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
24 గంటలు మోటార్లు నడపండి
దేవాదులలో 24 గంటలు మోటార్లు నడపండి. నీళ్లు ఎత్తి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేయండి. కల్వకుర్తిలో 24 గంటలు మోటార్లు నడపండి, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయండి. మీరు ఎత్తకపోతే గోదావరి కిందున్న ఏపీకి పోతుంది. కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, వెలిగొండ మీదుగా పోతాయి. మీ ఉద్దేశం తెలంగాణ ప్రజలను కాపాడటమా? ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు వదలటమా?
కరవు వచ్చిందని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. నిజానికి కరవు రాలేదు. మీరు నీళ్లు ఎత్తకపోవడంతో ఆంధ్రా వాళ్లు తీసుకుపోతున్నారు. కరవు వచ్చినప్పుడు చుక్క చుక్క నీరు కూడా ఎత్తాలి కదా? ఇప్పటికైనా ప్యాకేజీ 3 పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి'' అని రేవంత్ సర్కార్ ను హరీశ్ రావు డిమాండ్ చేశారు.








