Cm Revanth Reddy: తెలంగాణకు కృష్ణా జలాల విడుదల విషయంలో కర్ణాటక నుంచి సానుకూల స్పందన లభించింది. తెలంగాణకు కృష్ణా జలాలను విడుదల చేయాలన్న విజ్ఞప్తిని కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల తరఫున కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహ భావానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని అన్నారు.
కర్ణాటక, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న సోదర భావానికి కృష్ణా జలాల విడుదలే నిదర్శనం అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కర్ణాటక అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల మధ్య ప్రేమ, సోదర భావాన్ని చాటేలా కృష్ణా జలాల నిర్ణయం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ను కలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటి ఎద్దడిపై కర్ణాటక సీఎంకి మంత్రులు, ఎమ్మెల్యేలు వివరించారు. జూరాల ఆయకట్టుకు నీటి సమస్య ఏర్పడిందని.. దాదాపు 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని మంత్రుల బృందం తెలిపింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీరు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది.
జూరాలకు ఎగువున ఉన్న నారాయణపూర్ నుంచి దశలవారీగా నీరు విడుదల చేయాలని వారు కోరారు. రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున నెల రోజుల పాటు విడుదల చేయాలని చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని మంత్రుల బృందం కోరింది. దానికి డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి నీరు ఇచ్చే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.









