Jurala Water: జూరాలకు నీటి విడుదలకు సంబంధించి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నీటి విడుదలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, మెగా రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. బెంగళూరులోని కర్ణాటక రాష్ట్ర సచివాలయం ఇందుకు వేదికైంది.
జూరాల ప్రాజెక్ట్ కు కర్ణాటక నుంచి తగినంత నీటిని విడుదల చేయాలని మంత్రుల బృందం కోరింది. ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నందున రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, జూరాలకు నీటి విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా బేసిన్‌లో రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో మరింత నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించి గద్వాల జిల్లా రైతుల పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు, ప్రస్తుత పంటలకు అవసరమైన నీటిని అందించేందుకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. జూరాలకు నీటి విడుదలకు అంగీకారం తెలపడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు.. కర్ణాటక సీఎం, ఇరిగేషన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు
అంతకు ముందు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ను కలిసిన తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందం సాగునీటి అవసరాలను, సమస్యలను వివరించింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిపి పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎంని ప్రజాప్రతినిధులు కోరారు. జూరాల ప్రాజెక్టుకు కృష్ణా జలాలను విడుదల చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల పంటలను కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సహాయకరంగా ఉంటుందన్నారు. రెండు రాష్ట్రాల సమన్వయంతో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మరింత సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.









