TG: తెలంగాణలో తీవ్రమవుతున్న సాగునీటి కొరత, కరువు పరిస్థితులపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి.హరీశ్ రావు కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, రేవంత్ రెడ్డి అసమర్థ పరిపాలన ఫలితంగా తలెత్తిన మానవ తప్పిదమేనని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సొంత జిల్లా రైతులను ముంచి ఏపీకి ప్రయోజనమా
శ్రీశైలం జలాశయంలో తగినంత నీరు నిల్వ ఉన్నప్పటికీ తెలంగాణ ఆయకట్టుకు ఎందుకు విడుదల చేయడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకపోయినా, కృష్ణా బేసిన్ పరిధిలోకి రాని సుమారు 800 కిలోమీటర్ల దూరంలోని కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలిస్తుంటే రేవంత్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. శ్రీశైలంలో నీటిని వినియోగిస్తే పోతిరెడ్డిపాడు, వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులకు నీరు తగ్గుతుందనే ఉద్దేశంతోనే పంపులను ఆపేశారని, చంద్రబాబు పట్ల విధేయత చూపుతూ సొంత జిల్లా పాలమూరు రైతులకు సీఎం తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
పంపుల నిర్వహణలో తీవ్ర అలసత్వం
కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని తీసుకునే పూర్తి వెసులుబాటు ఉన్నా, ప్రస్తుతం రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పంపులు నడిపిస్తూ 800 క్యూసెక్కులకే పరిమితం చేస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టు పరిధిలోని 5 పంపులను 24 గంటల పాటు ఎందుకు పనిచేయించడం లేదని నిలదీశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 4 వేల కోట్లకు పైగా వెచ్చించి, పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేసి 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. అందుబాటులో ఉన్న జలాలను కూడా ఎత్తిపోయలేక రైతులను క్రాప్ హాలిడేల వైపు నెట్టడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు.
గోదావరి బేసిన్‌లోనూ పక్షపాతం
కృష్ణా బేసిన్‌తో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. దేవాదుల సమీపంలో కాంగ్రెస్ బ్యారేజీ నిర్మించకపోవడంతో కేసీఆర్ చొరవతో సమ్మక్క బ్యారేజీ పూర్తయిందని చెప్పారు. అక్కడ అర టీఎంసీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ పావు టీఎంసీ కూడా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమకు నీటి లభ్యత తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా రోజుకు 8 గంటలే మోటార్లు నడుపుతున్నారని ఆరోపించారు. పంపులను మాటిమాటికీ ఆపి ప్రారంభించడం వల్ల మోటార్లు దెబ్బతింటాయని హెచ్చరించారు.








