Fuel Price Hike: గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు నిప్పులు చెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం భారత చమురు మార్కెట్‌ను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేస్తోంది. విదేశాల్లో ముడి చమురు విలువ కొండెక్కుతున్నా, దేశంలో జనాలపై భారం మోపకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) పెట్రోల్, డీజిల్ రేట్లను మార్చకుండా హోల్డ్‌లో పెట్టాయి. దీంతో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతిరోజూ దాదాపు రూ. 530 కోట్ల మేర గట్టిగా నష్టపోతున్నాయని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' వెల్లడించింది.
లీటరుకు రూ. 9 వరకు.. సిలిండర్‌పై రూ. 300
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీల మార్జిన్లు భారీగా పడిపోయాయి. ఇక్రా తాజా నివేదిక ప్రకారం నష్టాల లెక్కలు ఇలా ఉన్నాయి. లీటరు పెట్రోల్ అమ్మకంపై కంపెనీలకు సుమారు రూ. 8 వరకు నష్టం వస్తోంది. లీటరు డీజిల్ అమ్మకంపై ఏకంగా రూ. 9 దాకా కోత పడుతోంది. ఇళ్లలో వాడే ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌పై సంస్థలకు దాదాపు రూ. 300 వరకు భారం పడుతోంది. ఈ మొత్తం నష్టాలను కలిపితే, ఆయిల్ సంస్థల జేబుల నుంచి రోజుకు ఏకంగా రూ. 530 కోట్లు హరించుకుపోతున్నాయని వెల్లడించింది.
క్రూడాయిల్ ఎందుకు మండిపోతోంది
మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను గందరగోళంలోకి నెట్టాయి. అమెరికా - ఇరాన్ మధ్య రాజుకున్న గొడవలు, సౌదీ అరేబియా తమ ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను హఠాత్తుగా ఆపేయడం, ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై హూతీలు దాడులు పెంచడం వల్ల మార్కెట్లో క్రూడ్ రేట్లు విపరీతంగా పెరిగాయి. గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో సగటున బ్యారెల్‌కు 66 డాలర్లుగా ఉన్న భారత ముడిచమురు బాస్కెట్ రేటు, తాజా దెబ్బతో ఏకంగా 117.4 డాలర్లకు చేరింది. అంటే చమురు కొనుగోలు ఖర్చు దాదాపు రెట్టింపు స్థాయికి చేరింది.
మళ్లీ ధరల బాదుడు తప్పదా
దేశీయ అవసరాల్లో 85 శాతానికి పైగా ముడిచమురును విదేశాల నుంచే కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారీ రేట్లకు చమురు కొనాల్సి రావడంతో కంపెనీల ఆదాయాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. రోజుకు రూ. 530 కోట్ల చొప్పున సుదీర్ఘ కాలం పాటు ఈ నష్టాలను కంపెనీలే సొంతంగా భరించడం సాధ్యం కాదు. కేంద్ర సర్కార్ వెంటనే జోక్యం చేసుకుని ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, లేదా కంపెనీలకు ప్రత్యేకంగా సబ్సిడీలను ప్రకటించడం వంటివి చేయకపోతే.. త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ రేట్లను మళ్లీ భారీగా పెంచడం ఖాయమనే హెచ్చరికలు గట్టిగా వినిపిస్తున్నాయి.








