తెలంగాణ

TG: కుండపోత వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణలో నేడు, రేపు (గురు, శుక్రవారాలు) అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

తెలంగాణలో నేడు, రేపు (గురు, శుక్రవారాలు) అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

 ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో నిన్నటి నుంచి రోజంతా ముసురు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. కల్లూరులో అత్యధికంగా 6.28 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, వర్షాల తీవ్రత దృష్ట్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

వర్షాలు, గాలిదుమారం రాష్ట్రంలో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు, హోర్డింగులు ఎగిరిపడగా, పిడుగుపాట్లు విరుచుకుపడ్డాయి. వేర్వేరు చోట్ల పిడుగులు పడి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరుకు చెందిన లక్ష్మి (35), జడ్చర్లకు చెందిన యాదమ్మ (66), పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన అంజమ్మ (55) అనే ముగ్గురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

 మరోవైపు, పిడుగుపాట్లతో చాలా చోట్ల మూగజీవాలు(మేకలు, గొర్రెలు) మృత్యువాతపడ్డాయి. రాబోయే రెండు రోజులు వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అధికారులు, సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

#TelanganaRains#RedAlertTelangana#TelanganaWeatherUpdate#HeavyRainfalls#BhadradriKothagudem#HyderabadWeather#LightningDeaths
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి