తెలంగాణ యాస, భాష, తీరు..
పారడైస్ సినిమా డైలాగ్ లతో పోటీ పడుతూ వీడియోలు
పోటీలో చతికల పడ్డ బీఆర్ఎస్ సోషల్ మీడియా
బలపడుతున్న హస్తం హ్యాండిల్స్
గులాబీ నేతల తొందరపాటు మాటలనే అస్త్రంగా మలుచుకుంటున్న కాంగ్రెస్
హౌస్ టూర్స్ వీడియోస్‌తో నేతల రాయల్ లైఫ్‌పై సెటైర్లు
సంపాదించుకోలేని పొలిటీషియన్స్ ఎవరో కూడా చూపిస్తారా?
పార్టీ ఏదైనా దోచుకునుడే వీళ్ల లక్ష్యం?
గ్రామాల్లో ఎకరాలతో ఒరిగేదేమీలేదు.. సిటీలో గజాలపైనే ఫోకస్?
పాలకులపై భూ ఫైటింగ్ చేయాలని స్వేచ్ఛ న్యూస్ పిలుపు
భూస్వాముల గడీలను గుర్తు చేసుకుంటున్న నెటిజన్స్
హైదరాబాద్‌లో ఉన్న కోటలను చూసి ఆశ్చర్యపోతున్న నియోజకవర్గ ప్రజలు
10 ఏండ్లు పాలనకు దూరంగా ఉండి.. 3 ఏండ్ల అధికార కాంగ్రెస్ నేతల ఇళ్లు ఎలా ఉన్నాయో ప్రజలకు చూపిస్తారా?
ప్రజా పాలన అంటే సోషల్ మీడియా సంబురాలేనా?
పాలకులపై భూ ఫైటింగ్ పార్ట్-2
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.
హస్తం హ్యాడిల్స్ బీభత్సం
బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి 3 ఏండ్లు అయినా 10 ఏండ్ల పాలనలో ఏం చేశారో ఇంకా కాంగ్రెస్ సోషల్ మీడియా ఎండగడుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు స్థబ్దుగా ఉన్న హస్తం హ్యాండిల్స్ అసెంబ్లీ సమావేశాల తర్వాత చాలా యాక్టివ్ అయ్యాయి. వారం రోజుల క్రితం వరకు ఊపు మీద ఉన్నబీఆర్ఎస్ సోషల్ మీడియా పోటీ పడడంలో చతికల పడుతోంది. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేల ఆస్తులను, ఇళ్లను ప్రజలకు చూపిస్తూ వాళ్లు అధికారంలో ఏమీ చేయలేదు, కేవలం ఆస్తులే సంపాదించుకున్నారనే స్థాయిలో ఎండగడుతున్నారు. సాధారణంగా అధికార పార్టీ నేతల ఇళ్లకు ప్రతిపక్ష నేతలు వెళ్లి హంగామా చేస్తారు. గతంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫాంహౌస్ అక్రమాలపై డ్రోన్ ఎగరవేసినట్లు. కానీ, ఇప్పుడు అధికార పార్టీ నేతలే ప్రతిపక్షాల ఫాంహౌస్‌లకు, హౌస్ టూర్లలో ఉన్న వీడియోలను చూపిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని చూపిస్తున్నారు.

వైరల్ అవుతున్న కొంతమంది వీడియోలు
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విల్లా, ఈయన ఉద్యోగిగా ఉండి ఏసీబీకి పట్టుపడ్డ తీరు, ఇప్పుడు ఇలా సంపాదించారని వైరల్ చేస్తున్నారు. జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు మూడు ఎకరాలు, రెండు దున్నపోతులు ఉండేవని ఎమ్మెల్యే శ్యాముల్ ఎద్దేవా చేశారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారని ఆయన ఇల్లును చూపించి ఆశ్చర్యానికి గురి చేసేలా వీడియోలు చూపిస్తున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బంజారాహిల్స్‌లో గుట్టపైన ఉన్న ఇల్లును చూసి కళ్లు చెదిరేలా ఉందని అంటున్నారు. నానక్ రామ్ గూడలో సంతోష్ రావు 150 కోట్ల బిల్డింగ్‌ను రమ్యారావు వెళ్లి చూపిస్తూ ఎండగట్టారు. బీఆర్ఎస్ నేతల కుమారులు విదేశాల్లో విద్యకు వెళ్తున్నప్పుడు మాట్లాడిన వీడియోలను వాడుకుని కార్యకర్తల పిల్లలు సంగతేంటని విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపి నేతల ఇళ్ల గురించి చెబుతారా?
పదేళ్లకు ముందు పాలనలో ఉన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు వాళ్ల ఇళ్లు, ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వారి ఇళ్లు, ఆ ఏరియాలో కార్పొరేటర్ అయిన వారి గుడిసెలు ఎలా ఉన్నాయో చూపించాలి. నేతల రూపంలో దోచుకునేందుకు రెడీగా ఉంటారు. వాళ్ల చూపులన్నీ ఏదో విధంగా కాంట్రాక్టర్ల రూపంలోనైనా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్లు అయినా, లేదా ఇండస్ట్రియలిస్టుల్లా కలరించి ఇస్తూ ఇళ్లను నిర్మించుకున్నారు. ఆ ఇళ్ల జోలికి రాకుండా జానారెడ్డి లాంటి నేతలు రోడ్ల విస్తరణలో స్థలం పోగొట్టుకునేందుకు ఇష్టం లేక హైకోర్టుకు వెళ్లారు. ఒక్కసారి బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో వాళ్లకు వచ్చే అద్దెలను చూపించినా అనేక విషయాలు బయటపడతాయి. బీజేపీ నేతల ఇళ్లు కూడా చాలా ఖరీదుగానే ఉంటాయి. ఇలా కంచుకోటలను నిర్మించుకున్న నేతలు ఎంతోమంది ఉన్నారు.
ఇళ్లే ప్రధాన ఆస్తి కూడా
ఎన్నేళ్లు ఉద్యోగం చేసినా సొంత ఇల్లు ఉండాలి. అందుకే నాయకులు కూడా అధికారం ఉన్నప్పుడే ఏండ్ల శ్రమ పడుతూ ఇళ్లు కట్టుకున్నారు. దాన్ని కూడా ప్రజల ఆస్తిగా చూపించడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్యారడైజ్ సినిమా పాటతో మళ్లీ క్రేజ్‌లోకి రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నాని సినిమా తెలంగాణ యాస, భాషతో ఇక్కడి ఉద్యమ స్ఫూర్తితో తీశారని తెలుస్తోంది. అందులో ఉన్న డైలాగులు, పాటలు రేవంత్ రెడ్డికి సరిపోయేలా ఉన్నాయని కాంగ్రెస్ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది. ఈ ఊపుతోనే బీఆర్ఎస్‌ను రాబోయే ఎన్నికల్లో యువతను దూరం చేసేలా ఎన్నికలు ఉండాలనే ఉద్దేశంతో వీడియోలు, పాటలు, పేరడీలు , కట్టుకథల నాటకాలు అన్ని ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, ట్విట్టర్, త్రెడ్స్, వాట్సప్ స్టేటస్‌లు ఇలా ప్రజలకు రీచ్ ఎలా అవుతాయో అలా చేసేందుకు హస్తం హ్యాండిల్స్ ముందుంజలో ఉన్నాయి. కానీ, ప్రభుత్వం అంటే సినిమాను తలపించే వీడియోలేనా, పాలనలో నీళ్లు, నిధులు, నియమాకాలు ఎక్కడ అని ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియాలోకి నేరుగా రావాలి. తప్పు ఎవరు చేసినా, భూ కబ్జాలు ఎలా చేస్తున్నారో కళ్లకు కట్టేలా చూపించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ ఖాళీని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉద్యమాల తెలంగాణ గడ్డకు తెలియాల్సి ఉంది.










