రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణపతి నిమజ్జనాల ఉత్సవాల్లో భాగంగా విధులు నిర్వహించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కింద పడిపోవడంతో సహచర ఉద్యోగి ఆయన్ను పైకి లేపారు. గాయాలపాలైన కొత్తగూడెం టూ టౌన్ ఎస్సై కె.వెంకన్న (55)ను హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఆయన క్షేమంగా కొత్తగూడంలోని తన ఇంటికి వెళ్లిపోయారు.
మంగళవారం రాత్రి సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు సమాచారం. మరో పోలీస్ అధికారితో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం వాహనం ఆపకుండానే పారిపోయారు.ఈ ఘటనలో ఆయన కుడి కాలికి స్వల్ప గాయాలయ్యాయి.చికిత్స తీసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్లినప్పటికీ ఒంటినొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 5.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.అయితే, ఆయన మరణానికి యాక్సిడెంట్ ప్రధాన కారణమా? ఇంకేమైనా ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఎస్సై మరణంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ద్విచక్ర వాహనంతో డ్యాష్ ఇచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఎస్సై కింద పడిన సమయంలో ఆయన తలకు ఏమైనా గాయం అయ్యిందా? దాని వల్లే ఆయన చనిపోయారా? లేదా అనారోగ్య సమస్యలే కారణమా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. విధి నిర్వహణలో భాగంగా ప్రమాదానికి గురై ఎస్సై మృతి చెందడంతో తెలంగాణ పోలీసుశాఖ తీవ్ర దిగ్బ్రాంతికి గురైనట్టు సమాచారం. డిపార్ట్మెంట్ తరఫున వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నట్టు సమాచారం.












