హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్త ఐకాన్‌గా విరాజిల్లుతున్న చారిత్రక చార్మినార్ రక్షణ, నిర్వహణ పట్ల భారత పురావస్తు శాఖ (ASI) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో చార్మినార్ మొదటి అంతస్తు లాడ్ బజార్ వైపు ఉన్న భాగం నుంచి సున్నపు పెచ్చులు, డిజైన్ పువ్వుల భాగాలు ఊడి కిందపడిపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరగడం, ఆ సమయంలో పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో కూడా మక్కా మసీదు వైపు ఉన్న వైపు నుంచి, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దిశలో ఉన్న మినార్ల భాగాల నుంచి పలుమార్లు పెచ్చులు ఊడిపడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. పదేపదే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, పురావస్తు శాఖ అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టకుండా ఉపరితల పూతలతో మభ్యపెడుతున్నారని స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కట్టడం విచ్ఛిన్నమవుతున్నా పర్యవేక్షణ కరువైందని మండిపడుతున్నారు.
విషయం తెలిసిన వెంటనే చార్మినార్ భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, కిందపడిన శకలాలను తొలగించి ఆ ప్రాంతాన్ని పునరుద్ధరించారు. అయితే, వర్షపు నీరు గోడల రంధ్రాల గుండా లోపలికి ఇంకడం వల్లే ఈ ప్లాస్టరింగ్ ఊడిపడిందని, ప్రాథమికంగా నిర్మాణానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. దెబ్బతిన్న భాగాల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని అధికారుల వర్గాలు పేర్కొన్నాయి.
ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తున్న చార్మినార్‌ను కాపాడుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని వారసత్వ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, చార్మినార్ నలువైపులా సమగ్రమైన పునరుద్ధరణ పనులు చేపట్టాలని, భవిష్యత్తులో పర్యాటకులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












