తెలంగాణ

BRS : నేడు థర్మల్ ప్లాంట్ల పరిశీలనకు బీఆర్ఎస్ బృందాలు

రచన: Kumar5 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్‌ల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై బీఆర్ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్స్‌కు వెళ్లి నిజనిర్ధారణ చేయనున్నాయి.

రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్‌ల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై బీఆర్ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్స్‌కు వెళ్లి నిజనిర్ధారణ చేయనున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇందులో భాగస్వాములు కానున్నారు.

రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలైన తరుణంలో అటు ప్రజలు, ఇటు రైతుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నిన్న సచివాలయంలో కూడా పవర్, ఇంటర్నెట్ షట్‌డౌన్ అయినట్టు కథనాలు రావడంతో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సైతం విద్యుత్ శాఖ మీద సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

అంతకుముందు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొన్నదని, ‘కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు థర్మల్ ప్లాంట్స్ సందర్శన గురించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణలోని ప్రధాన థర్మల్ పవర్ ప్లాంట్లలో బీఆర్ఎస్ బృందాలు పర్యటన చేపట్టాయి. యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి, కాకతీయ, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి మీద గులాబీ నేతలు పరిశీలన చేయనున్నారు.

హైదరాబాద్‌లోని సింగరేణి హెడ్‌క్వార్టర్స్‌లోనూ బీఆర్ఎస్ బృందం పర్యటించనుంది. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించనుండగా.. కొత్తగూడెం పవర్ ప్లాంట్‌ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో పరిశీలించనున్నారు. ఇక భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పరిశీలించనున్నారు.

కాకతీయ పవర్ ప్లాంట్‌ను ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో సత్యవతి రాథోడ్, గండ్ర వెంకట రమణారెడ్డి పరిశీలించనున్నారు. సింగరేణి పవర్ ప్లాంట్‌ను జోగు రామన్న, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, బాల్క సుమన్ ఆధ్వర్యంలో పరిశీలించనున్నారు.

సింగరేణి హెడ్‌క్వార్టర్స్‌ను కొప్పుల ఈశ్వర్, వివేకానంద గౌడ్, శంబీపూర్ రాజు, దాసోజు ఆధ్వర్యంలో పరిశీలించనున్నారు.ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి, సామర్థ్యం, ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.ప్రాజెక్టుల్లో జాప్యాలు, నిర్వహణ సమస్యలపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి మీడియాకు కీలక వివరాలు వెల్లడించనున్నట్టు బీఆర్ఎస్ తెలిపింది.

#BRS#Thermal power stations#visit#telangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి