తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు పెండింగ్ డియర్‌నెస్ అలవెన్సులను (DA) కలిపి మొత్తం 6.4శాతం చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అక్టోబర్ 1న జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశంలో ఈ డీఏల పెంపునకు అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సర్కార్, కొత్త వేతన సవరణ కమిషన్ (PRC) నివేదికను ఈ నెలాఖరు నాటికి తెప్పించుకుంటామని తెలిపింది. అంతేకాకుండా, ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి విడతలవారీగా పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నిర్ణయాలతో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.
మరోవైపు, ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్ (CPS) రద్దు అంశంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు మూడు నెలల కాలపరిమితితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులు లేవనెత్తిన మొత్తం 69 సమస్యలను దశలవారీగా పరిష్కరించడానికి క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతికుమారి భరోసా ఇచ్చారు.
ఉద్యోగులు హైదరాబాద్ రావొద్దు: టీజీఈ జేఏసీ
ప్రభుత్వ పక్షం నుంచి లభించిన సానుకూల స్పందన చర్చల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగాల్సిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీజీఈజేఏసీ (TGEJAC) రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరూ హైదరాబాద్‌కు రావద్దని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మరోవైపు దసరా పండుగ వేళ డీఏ విడుదల ప్రకటన రావడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.












