బీటెక్ ఇకపై ఐదేళ్లా..?
తెరపైకి కొత్త ప్రతిపాదన
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సూచనలు
బాంబే ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో విద్యార్థులపై ఉన్న అకడమిక్ ఒత్తిడి మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఐఐటీ దిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలానీ క్యాంపసెస్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామ్‌గోపాల్‌రావు చేసిన ఒక ప్రతిపాదన ఇప్పుడు విద్యా రంగంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నాలుగేళ్లుగా ఉన్న బీటెక్‌ను ఐదేళ్ల ఫ్లెక్సిబుల్ ప్రోగ్రామ్‌గా మార్చే అవకాశాన్ని ఐఐటీలు పరిశీలించాలన్నది ఆయన సూచన.
అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే.. బీటెక్ ఐదేళ్లు చేయడం నిజంగా సాధ్యమేనా? అలా చేస్తే విద్యార్థులకు ప్రయోజనమా?
లేక ఒక సంవత్సరం అదనంగా చదవడం వల్ల సమయం, ఖర్చు పెరుగుతాయా? ముఖ్యంగా.. ఈ విధానం ఐఐటీలకే పరిమితమవుతుందా? లేక దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యలో ఇలాంటి మార్పులకు అవకాశం ఉందా?
నాలుగేళ్ల బీటెక్ నుంచి ఐదేళ్ల ఫ్లెక్సిబుల్ మోడల్
రామ్‌గోపాల్‌రావు ప్రతిపాదనను సాధారణంగా అందరూ ఐదేళ్లు చదవాలి అని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సూచించిన మోడల్‌లో ఐదేళ్లు గరిష్ఠ వ్యవధిగా ఉండే ఫ్లెక్సిబుల్ బీటెక్ ఆలోచన ఉంది. నిర్దేశిత క్రెడిట్లు పూర్తి చేసిన విద్యార్థులు నాలుగేళ్లలోనే, అవసరమైతే మూడున్నరేళ్లలో కూడా కోర్సు పూర్తి చేసుకునే అవకాశం ఉండాలి. మరోవైపు అదనపు సమయం అవసరమైన విద్యార్థులు ఐదేళ్ల వరకు కోర్సును విస్తరించుకోవచ్చు. వారికి రికార్డెడ్ లెక్చర్లు, ఆన్‌లైన్ మెటీరియల్, భాషా సహాయం వంటి అదనపు అకడమిక్ సపోర్ట్ ఇవ్వాలని ఆయన సూచించారు.
అంటే.. విద్యార్థి వేగానికి అనుగుణంగా కోర్సు వ్యవధి మారాలి.. కానీ విద్యా ప్రమాణాలు మాత్రం మారకూడదు అనేది ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఆలోచన.
అసలు ఈ విధానం ఎందుకు అవసరం?
ఐఐటీల్లో చేరే విద్యార్థుల అకడమిక్ నేపథ్యం ఒకేలా ఉండదు. ఒకవైపు చిన్నప్పటి నుంచే తీవ్రమైన కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఉంటే.. మరోవైపు స్వయంగా చదువుకుంటూ జేఈఈలో ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఉంటారు. ఒకే తరగతి గదిలో విభిన్న ప్రాంతాలు, భాషలు, విద్యా నేపథ్యాలు, అభ్యసన వేగాలతో వచ్చిన విద్యార్థులు కూర్చుంటారు.
రామ్‌గోపాల్‌రావు అభిప్రాయం ప్రకారం, కోచింగ్‌లో ఒక నిర్దిష్ట రకం ప్రశ్నలను వేగంగా పరిష్కరించడానికి అలవాటు పడటం, కొత్త సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించగలగడం రెండూ ఒకటే కాదు. అందుకే జేఈఈలో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థి కూడా ఐఐటీ తరగతిలో కొత్త తరహా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
ఇక్కడే "వన్ సైజ్ ఫిట్స్ ఆల్" విధానం ప్రశ్నార్థకంగా మారుతోంది. అందరూ ఒకే వేగంతో నేర్చుకోలేనప్పుడు.. అందరికీ ఒకే టైమ్‌లైన్ ఎందుకు?
ఐదేళ్ల బీటెక్‌తో లాభాలేంటి?
అకడమిక్ గ్యాప్ భర్తీ చేసుకునే అవకాశం. కొంతమంది విద్యార్థులకు కొన్ని ప్రాథమిక అంశాలపై అదనపు సమయం అవసరం కావచ్చు. ఐదో సంవత్సరం అలాంటి విద్యార్థులకు ఆ గ్యాప్‌ను భర్తీ చేసుకునే అవకాశం ఇస్తుంది.
ఒత్తిడి తగ్గే అవకాశం. ప్రతి సెమిస్టర్‌లో భారీ క్రెడిట్లు, పరీక్షలు, అసైన్‌మెంట్లు పూర్తి చేయాలనే ఒత్తిడి కొంత మేర తగ్గించవచ్చు. ముఖ్యంగా ఒకటి రెండు సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనపు సమయం ఉపయోగపడొచ్చు.
విద్యార్థుల అభ్యసన వేగానికి అనుగుణంగా విద్య. అందరూ ఒకే వేగంతో నేర్చుకోవాలనే బదులు.. వేగంగా నేర్చుకునే విద్యార్థులు ముందుగానే పూర్తి చేసుకోవచ్చు. అదనపు సమయం అవసరమైన వారు ఐదేళ్ల వరకు కొనసాగవచ్చు.
ప్రమాణాలు తగ్గకుండా సపోర్ట్ ఇవ్వొచ్చు. ఇది పాస్ మార్కుల్ని తగ్గించే విధానం కాదు. అవసరమైన క్రెడిట్లు, కోర్సు అవసరాలు పూర్తి చేయాల్సిందే. మారేది కాలవ్యవధి, అకడమిక్ సపోర్ట్ మాత్రమే.
ఐదో సంవత్సరం ప్రత్యేక ముద్ర పడకుండా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికీ ఐదేళ్ల విండో ఉంటే.. అదనపు సంవత్సరం తీసుకున్న విద్యార్థిని "వెనుకబడిన విద్యార్థి"గా ప్రత్యేకంగా గుర్తించే అవకాశం తగ్గుతుంది. రామ్‌గోపాల్‌రావు ప్రతిపాదనలో ఇదొక ముఖ్యమైన అంశం.
నష్టాలు కూడా ఉన్నాయి!
ఐదేళ్ల బీటెక్ అంటే ప్రయోజనాలే అని చెప్పడం కూడా సరైంది కాదు. ఒక సంవత్సరం అదనపు సమయం.. అదనపు ఖర్చు. హాస్టల్, ఫీజులు, ఆహారం, ఇతర జీవన వ్యయాలు పెరగవచ్చు. కుటుంబాలపై ఆర్థిక భారం కూడా పెరిగే అవకాశం ఉంది.
ఉద్యోగంలోకి ప్రవేశం ఆలస్యం
నాలుగేళ్లలో కోర్సు పూర్తి చేయగలిగే విద్యార్థి ఐదేళ్లు తీసుకుంటే ఉద్యోగంలోకి ప్రవేశించే సమయం ఒక సంవత్సరం వెనక్కి వెళ్లవచ్చు. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, ఉన్నత చదువులు, పోటీ పరీక్షల విషయంలో టైమ్‌లైన్ ప్రభావితం కావచ్చు.
కరిక్యులమ్ మరింత క్లిష్టం
ఐదో సంవత్సరం పెంచడం మాత్రమే పరిష్కారం కాదు. ఏ సబ్జెక్టులు ఎప్పుడు బోధించాలి? ఐదో సంవత్సరం ఏం నేర్పాలి? అదనపు అధ్యాపకులు, ల్యాబ్‌లు, మెంటార్లు ఎలా అందించాలి? అనే ప్రశ్నలకు కూడా సమాధానం కావాలి.
విద్యార్థులు అవసరం లేకపోయినా ఐదేళ్లు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. నాలుగేళ్లలో పూర్తి చేయగలిగిన విద్యార్థులు కూడా ఇంకో సంవత్సరం ఉంది అనే భావనతో వేగం తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్ ఆధారిత స్పష్టమైన నియమాలు అవసరం.
ఐదేళ్ల బీటెక్ ఐఐటీల్లో మాత్రమేనా?
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రస్తుతం రామ్‌గోపాల్‌రావు చేసిన ప్రతిపాదన ఐఐటీలను ఉద్దేశించినదే. దేశంలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐదేళ్ల బీటెక్‌ను అమలు చేయాలని ఇప్పటివరకు ఆయన ప్రతిపాదనలో లేదు. అయితే దేశంలోని ఇంజినీరింగ్ విద్యా వ్యవస్థ ఇప్పటికే నాలుగేళ్ల డిగ్రీ, క్రెడిట్ ఆధారిత విధానం, మల్టిపుల్ ఎంట్రీ–ఎగ్జిట్, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ వైపు కదులుతోంది.
NEP 2020లోనే ఉన్నత విద్యకు ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్, మల్టిపుల్ ఎంట్రీ–ఎగ్జిట్, అకడమిక్ క్రెడిట్ల బదిలీ వంటి విధానాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంజినీరింగ్ విద్యకు సంబంధించిన నాలుగేళ్ల మల్టీడిసిప్లినరీ ఫ్రేమ్‌వర్క్‌లో కూడా విద్యార్థులకు వివిధ సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం, క్రెడిట్ ఆధారిత ఫ్లెక్సిబిలిటీ, మల్టిపుల్ ఎంట్రీ–ఎగ్జిట్ వంటి అంశాలు ఉన్నాయి.
అందువల్ల భవిష్యత్తులో విద్యార్థి అవసరాన్ని బట్టి కోర్సు వ్యవధిలో మరింత ఫ్లెక్సిబిలిటీ రావడం అసాధ్యం కాదు. కానీ దేశంలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఐదేళ్లు కానుంది అని ప్రస్తుతం చెప్పడానికి ఆధారం లేదు.
ఐదేళ్ల బీటెక్ కొత్త ఆలోచనేనా?
ఇది పూర్తిగా కొత్తది కూడా కాదు. దేశంలోని కొన్ని ఐఐటీలు ఇప్పటికే ఐదేళ్ల B.Tech + M.Tech డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటీ ఇందోర్‌లో ఐదేళ్ల B.Tech+M.Tech ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. అయితే అది రామ్‌గోపాల్‌రావు ప్రతిపాదిస్తున్న నాలుగేళ్ల బీటెక్‌ను ఐదేళ్ల ఫ్లెక్సిబుల్ వ్యవధిగా మార్చడంతో సమానమైంది కాదు.
అంటే ఐదేళ్ల వ్యవధి అనే కాన్సెప్ట్ విద్యా వ్యవస్థకు పూర్తిగా కొత్తది కాదు. కానీ అదనపు సంవత్సరం ద్వారా ఒకే B.Techను విద్యార్థి నేర్చుకునే వేగానికి అనుగుణంగా పూర్తి చేసే మోడల్ మాత్రం ఇప్పుడు కొత్తగా చర్చలోకి వచ్చింది.
ఐఐటీలో సీటు రావడం ఎంత కష్టమో.. ఆ సీటు వచ్చిన తర్వాత అక్కడి అకడమిక్ ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగడం కూడా అంతే పెద్ద సవాల్. అందుకే పరిష్కారం కేవలం కోర్సు వ్యవధిని నాలుగు నుంచి ఐదేళ్లకు పెంచడమేనా? లేక.. మెంటారింగ్ పెంచాలా? కోచింగ్ నుంచి స్వతంత్ర అభ్యసనానికి మారేలా మొదటి ఏడాదిలో ప్రత్యేక బ్రిడ్జ్ కోర్సులు పెట్టాలా? రికార్డెడ్ లెక్చర్లు, అదనపు ట్యుటోరియల్స్, భాషా సహాయం అందించాలా? లేదా వీటన్నింటినీ కలిపి ఒక ఫ్లెక్సిబుల్ మోడల్ రూపొందించాలా? ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే.











