పక్కా స్కెచ్ తో అవినీతి సామ్రాజ్యం
కాంట్రాక్ట్ ఉద్యోగాలతో కోట్లకు పడగ
తవ్వేకొద్దీ బయటపడుతున్న లక్ష్మీ భాస్కర్ లీలలు
ఈ లక్కీ భాస్కర్ వెనుక ఉన్నదెవరు..?
ఒక ప్రభుత్వ వైద్యుడు.. నిమ్స్‌లో కీలక పరిపాలనా బాధ్యతలు.. మరి ఇంత భారీగా ఆస్తులు ఎలా వచ్చాయి? నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్ ఎపిసోడ్ లో వినిపిస్తున్న ప్రశ్నలివి. వైద్యం చేయాల్సిన డాక్టర్.. ప్రభుత్వ జీతంతో పనిచేసే వైద్యాధికారి.. కానీ ఇప్పుడు ఆయన ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఏసీబీ ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. సోదాల్లో గుర్తించిన ఆస్తుల డాక్యుమెంట్ విలువ రూ.6.13 కోట్లు కాగా, వాటి మార్కెట్ విలువ రూ. 80 నుంచి 100 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.
ప్రభుత్వ వైద్యుడిగా సంపాదించే ఆదాయానికి.. బయటపడుతున్న ఆస్తులకు మధ్య ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది? ఇది కేవలం ఒక అధికారి ఆస్తుల వ్యవహారం కాదు. ప్రభుత్వ ఆస్పత్రిలో నియామకాలు, పరిపాలనా నిర్ణయాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు, పరికరాల కొనుగోళ్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ అవసరమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాంట్రాక్ట్ ఉద్యోగాలే అక్రమ సంపాదనకు మార్గమా?
లక్ష్మీ భాస్కర్ చుట్టూ వినిపిస్తున్న ప్రధాన ఆరోపణల్లో కాంట్రాక్టు ఉద్యోగాల వ్యవహారమే కీలకమైందిగా తెలుస్తోంది. ఉద్యోగులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించడం.. వారికి ఎక్స్ పీరియన్స్ లెటర్లు ఇవ్వడం.. స్థానికులుగా చూపించేందుకు రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇప్పించడం.. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజేషన్ చేయడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఊరకనే చేయరు కదా.. అన్నింటికీ ఓ రేటు ఉంటుంది. ఆ రేటే లక్ష్మీ భాస్కర్ కి కోట్లు తెచ్చిపెట్టిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ నిజమైతే.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఏ స్థాయిలో దుర్వినియోగమైందో అర్థం చేసుకోవచ్చు.
లక్ష్మీ భాస్కర్ పై తీవ్ర ఆరోపణలు...
నాలుగు లక్షల రూపాయల జీతం ఉన్న ఉద్యోగికి రెండు లక్షలు మాత్రమే అకౌంట్‌లో చెల్లించి, మిగిలిన మొత్తాన్ని వేరే మార్గంలో వసూలు చేసేవారని ఆరోపణలు వస్తున్నాయి. ఎవరెవరు ఇందులో భాగస్వాములు? ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లిన మొత్తాలు, కాంట్రాక్టర్ చెల్లింపులు, నియామక రికార్డులను పరిశీలిస్తే నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగం ఒకరి జీవనాధారం. దాన్ని అక్రమ వసూళ్లకు మార్గంగా మార్చారనే ఆరోపణలు వస్తే.. బాధ్యత ఎవరిది? ఇది దర్యాప్తు సంస్థలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న.
రోబోటిక్ మెషీన్ల కొనుగోళ్లలోనూ ఆరోపణలేనా?
నిమ్స్‌లో రోబోటిక్ మెషీన్లు వచ్చిన సమయంలోనూ లక్ష్మీ భాస్కర్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరికరాల కొనుగోళ్లలో టెండర్ ప్రక్రియ ఎలా జరిగింది? ధరల నిర్ణయంలో పారదర్శకత పాటించారా? అధికారుల పాత్ర ఏమిటి? ఏవైనా అక్రమ చెల్లింపులు జరిగాయా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి పరికరం ప్రజాధనంతోనే సమకూరుతుంది. అందువల్ల కొనుగోళ్లపై ఆరోపణలు వస్తే వాటిపై స్వతంత్ర విచారణ అత్యంత ఆవశ్యకం.
బీరప్పతో కలిసి అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు
లక్ష్మీ భాస్కర్‌పై వినిపిస్తున్న మరో ఆరోపణ.. అప్పటి నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో కలిసి అక్రమాస్తులు కూడబెట్టారనేది. అలాగే రాజకీయ స్థాయిలో మంత్రి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా సంచలనంగా మారాయి. ఇంతకీ ఎవరా మంత్రి..? ఏంటా కథ..? ఒక ప్రభుత్వ వైద్యాధికారి ఆస్తులపై దర్యాప్తు జరుగుతున్నప్పుడు.. ఆయన పనిచేసిన పరిపాలనా విభాగాలు, తీసుకున్న నిర్ణయాలు, ఆయనతో కలిసి పనిచేసిన అధికారుల పాత్రపై విచారణ ఎందుకు జరగకూడదు? ఆస్తుల మూలాలు మాత్రమే కాదు.. వాటిని సంపాదించడానికి ఉపయోగించిన మార్గాలపై కూడా దర్యాప్తు జరగాలి.
ప్రభుత్వ జీతం.. ఇన్ని ఆస్తులు.. సమాధానం ఎవరు చెప్పాలి?
ఏసీబీ గుర్తించిన ఆస్తుల్లో ఫ్లాట్లు, స్థలాలు, ఖరీదైన కార్లు, బంగారం, బ్యాంకు నిల్వలు, పెట్టుబడులు ఉన్నాయి. 517.8 గ్రాముల బంగారం, జాగ్వార్, ఆడి వాహనాలు, అనేక ఫ్లాట్లు, రూ.1.33 కోట్ల హ్యాండ్ లోన్స్ ఇచ్చినట్లు ఏసీబీ వెల్లడించిన వివరాల్లో ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. వైద్యం చేసే డాక్టర్.. ప్రభుత్వ జీతంపైనే పనిచేసే అధికారి.. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సంపాదించగలిగారు?
ఆయన ఆదాయం ఎంత? ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశారు? వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు లక్ష్మీ భాస్కర్ మాత్రమే కాదు.. దర్యాప్తు సంస్థలు, నిమ్స్ యాజమాన్యం, ప్రభుత్వ వ్యవస్థ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది.
నిమ్స్ ప్రజల విశ్వాసంతో నడిచే ఆస్పత్రి. అక్కడి ఉద్యోగ నియామకాలు, వైద్య పరికరాల కొనుగోళ్లు, పరిపాలనా నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి. లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి.. ఆస్తుల మూలాలు, ఆరోపణల వెనుక వాస్తవాలు, బాధ్యుల పాత్ర బయటపడాల్సి ఉంది. లక్కీ భాస్కర్ ఆస్తుల వెనుక అసలు కథేంటి? కాంట్రాక్ట్ ఉద్యోగాల ఆరోపణల్లో నిజమెంత? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాల్సిందే.







