TG: ప్రభుత్వ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగడం, మీ సేవ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం ఇకపై గతం కానుంది. పౌర సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విప్లవానికి తెరతీసింది. సరికొత్త సాంకేతిక సంస్కరణలతో తయారు చేసిన ‘మీ సేవ డోర్ డెలివరీ’ సేవలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాంఛనంగా స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దీనికి సంబంధించిన ఆధునిక పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఒక్క కాల్.. లేదంటే స్లాట్ బుకింగ్ చాలు
సామాన్యులకు ఎలాంటి శ్రమ లేకుండా ఇంటి ముంగిట్లోనే ప్రభుత్వ సేవలందించేందుకు సర్కార్ అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. పౌరులు తమకు కావాల్సిన సర్టిఫికెట్ల కోసం కేవలం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినా లేదా అధికారిక మీ సేవ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన సమయానికి స్లాట్ బుక్ చేసుకున్నా సరిపోతుంది. అలా సమాచారం అందిన వెంటనే శిక్షణ పొందిన మీ సేవ ఎగ్జిక్యూటివ్ స్వయంగా మీ ఇంటి గడప వద్దకే వచ్చి అవసరమైన పత్రాలను పరిశీలించి, దరఖాస్తును పూర్తి చేస్తారు.
ఇంటి వద్దే లభించే కీలక సేవలివే
బర్త్, డెత్ ధ్రువీకరణ పత్రాలు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్లు, ఆస్తులకు సంబంధించిన ఈసీ కాపీలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ల సంబంధిత సేవలు, పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ పౌర సేవలు ఇకపై మీ ఇంటి వద్దేకే రానున్నాయని తెలిపారు. అలాగే మీ సేవ నెట్‌వర్క్ ద్వారా అందించే అన్ని రకాల కీలక ప్రభుత్వ సేవలను ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా ఇంటి నుంచే నేరుగా పొందే వెసులుబాటును ఈ విధానం కల్పిస్తుందన్నారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తం
ఈ వినూత్న సేవలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా నడిపించేందుకు ఇప్పటికే 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, గ్రామ స్థాయి వ్యవస్థాపకులకు అధునాతన ప్రత్యేక శిక్షణ అందించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. తొలి దశలో భాగంగా అర్బన్ పరిధిలోని ‘క్యూర్’ ప్రాంతాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని నగరాలు, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవకాశం లేని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ఈ డోర్‌స్టెప్ మీ సేవ విధానం ఒక గొప్ప వరంలా మారనుందని ఆశా భావం వ్యక్తం చేశారు.







