కూకట్‌పల్లి, సర్దార్ పటేల్ నగర్ : హైదరాబాద్ మహానగరంలో పలు విద్యా సంస్థలు ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. ఇరుకు వీధుల్లో కనీసం వాహనాలు వెళ్లేందుకు కూడా దారిలేని ప్రదేశంలో బహుల అంతస్థుల్లో పాఠశాలలను నడుపుతున్నట్టు సమాచారం. ఫలితంగా ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ నుంచి విద్యార్థులు సేఫ్‌గా బయటకు వస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నగరంలోని శ్రీ శ్రీమన్నారాయణ స్కూల్‌లో సేఫ్టీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్న శ్రీ శ్రీమన్నారాయణ హైస్కూల్‌లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్కూల్‌లో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, ఫైర్ NOC ఉన్నాయా? అనే అంశంపై తల్లిదండ్రులు, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఆటలు ఆడేందుకు, శారీరక కార్యకలాపాలు నిర్వహించేందుకు తగిన గ్రౌండ్ సౌకర్యం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం బహుల అంతస్తుల భవనంలో ఎలాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూల్ నడుస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, భవనం పైభాగంలో అనుమతులు లేకుండా రేకుల షెడ్డు నిర్మించి తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్మాణానికి సంబంధించి సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే విషయాలపై అధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, విద్యార్థుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, విద్యార్థుల భద్రత, ఆటస్థలం, మౌలిక సదుపాయాల విషయంలో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే అంశంపై తల్లిదండ్రులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.సంబంధిత విద్యాశాఖ, జీహెచ్‌ఎంసీ, ఫైర్ సర్వీసెస్ అధికారులు పాఠశాలను పరిశీలించి, అనుమతులు, భద్రతా ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.రేపటి రోజున ఏదైనా ప్రమాదం జరగక ముందే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.







