National

బీహార్‌లో అసలేం జరుగుతోంది..! అమ్మాయిలకు రక్షణే లేదా..?

రచన: Kashi6 నిమిషాల పఠనం

బీహార్‌లో రెండు వైరల్ వీడియోలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఒకటి జముయ్‌లో.. మరొకటి సమస్తిపూర్‌లో. ఒక ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన కొద్ది రోజులకే.. మరో ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో దీనిని కేవలం రెండు నేర ఘటనలుగా చూడాలా? లేక బీహార్‌లో మహిళలు, బాలికల భద్రతపై మరింత లోతుగా చర్చించాలా?

ముందు జముయ్.. తర్వాత సమస్తిపూర్

బీహార్‌లో మహిళలు, బాలికలకు భద్రత లేదా..?

వరుస ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం

బీహార్‌లో రెండు వైరల్ వీడియోలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఒకటి జముయ్‌లో.. మరొకటి సమస్తిపూర్‌లో. ఒక ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన కొద్ది రోజులకే.. మరో ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో దీనిని కేవలం రెండు నేర ఘటనలుగా చూడాలా? లేక బీహార్‌లో మహిళలు, బాలికల భద్రతపై మరింత లోతుగా చర్చించాలా? అనేది సంచలనంగా మారింది.

జముయ్‌లో ఏం జరిగింది?

సెప్టెంబర్ 19న జముయ్ జిల్లాలో ఓ బాలిక, ఆమెతో ఉన్న వ్యక్తిని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. కోచింగ్‌ నుంచి తిరిగి వస్తున్న సమయంలో వారిని చుట్టుముట్టి వేధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం ఒక్కసారిగా రాష్ట్రం దాటి దేశవ్యాప్త చర్చగా మారింది. వీడియోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసే సమయంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటన సంచలనంగా మారింది.

సమస్తిపూర్ లో సేమ్ సీన్

కానీ కథ అక్కడితో ఆగలేదు. కొద్ది రోజులకే సమస్తిపూర్‌లో మరో వీడియో. జముయ్ ఘటనపై చర్చ జరుగుతుండగానే సమస్తిపూర్ నుంచి మరో వీడియో బయటకు వచ్చింది. కర్పూరిగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్‌సింగ్ బంధ్ బైపాస్ ప్రాంతంలో ఓ బాలిక తనతో ఉన్న ఓ యువకుడితో కలిసి ఫొటోలు తీసుకుంటుండగా కొందరు వ్యక్తులు వారిని చుట్టుముట్టారు. ఆ తర్వాత బాలికను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను ఎవరో మొబైల్‌లో చిత్రీకరించారు. అదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు సమస్తిపూర్ ఎస్పీ తెలిపారు.

జముయ్ ఘటన తర్వాత బీహార్‌లో ఇంతటి చర్చ జరిగింది. పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా కొద్ది రోజులకే మరో ప్రాంతంలో దాదాపు అదే తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఎలా బయటకు వచ్చింది? వైరల్ వీడియోలే పోలీసులకు అలారం అవుతున్నాయా? ఈ రెండు ఘటనల్లో కనిపిస్తున్న మరో ముఖ్యమైన అంశం సోషల్ మీడియా.

రెండు ఘటనలూ మొదట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదుల ద్వారా కాకుండా.. వీడియోలు వైరల్ కావడం ద్వారా పెద్దస్థాయిలో వెలుగులోకి వచ్చాయి. జముయ్‌లోనూ ఇదే జరిగింది. సమస్తిపూర్‌లోనూ వైరల్ వీడియో ఆధారంగానే పోలీసులు సుమోటోగా చర్యలు ప్రారంభించారు.

ఈ ఘటనలు రెండు రకాల ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒకటి.. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు నిరోధక చర్యలు ఎంతవరకు ఉన్నాయి? రెండు.. ఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయితేనే యంత్రాంగం వేగంగా కదులుతోందా? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కేవలం రెండు ఘటనలు సరిపోవు.

ఒక ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న సమయంలోనే మరో ఘటన వెలుగులోకి రావడం.. మహిళలు, బాలికల భద్రతపై బీహార్‌లో మరోసారి తీవ్రమైన చర్చకు కారణమైంది. రాజకీయ వేడి కూడా పెరిగింది.

ఈ వరుస ఘటనలు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష ఆర్జేడీ బీహార్‌లో శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికార పక్షానికి చెందిన సమస్తిపూర్ ఎంపీ శాంభవి చౌదరి కూడా తాజా ఘటనను ఖండిస్తూ.. పోలీసు అధికారులతో మాట్లాడి వేగంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అసలు బీహార్ లో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మహిళలు, బాలికలు బహిరంగ ప్రదేశాల్లో ఎంతవరకు సురక్షితంగా ఉన్నారు? అన్న ప్రశ్నలపైకి చర్చ వెళ్తోంది.

జముయ్ ఘటన తర్వాత పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సమస్తిపూర్ కేసులోనూ దర్యాప్తు ప్రారంభమైంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఒక దశ. కానీ అసలు పరీక్ష మాత్రం అంతకంటే పెద్దది. వైరల్ వీడియో వచ్చిన తర్వాత నిందితులను పట్టుకోవడం మాత్రమే కాదు.. అలాంటి వీడియోలు బయటకు రావాల్సిన పరిస్థితి రాకుండా చేయగలుగుతున్నారా? బీహార్‌లో ఇప్పుడు ప్రజల ముందున్న అసలు ప్రశ్న ఇది.

#Bihar News#Bihar Crime#Bihar Law And Order#Bihar Safety#Bihar Viral Video#Bihar Harassment Case#Samastipur News#Jamui News#Women Safety#Girls Safety#Bihar Police#Crime News#India News#Bihar Latest News#Viral Video Case
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి