దేశంలోని వివిధ కోర్టుల్లో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న పలువురికి సుప్రీంకోర్టు కొలీజియం శుభవార్త చెప్పింది. ఇంతకాలం అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న వారికి పర్మినెంట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు వీరు విధులు నిర్వహిస్తున్న చోటనే శాశ్వత జడ్జిలుగా తీర్పులు చెప్పనున్నారు. పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం కోసం న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు, కొత్త వారి నియామకానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలి కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సైతం సహకారం అందిస్తున్నది.
ఈ క్రమంలోనే నాలుగు ప్రధాన హైకోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. బుధవారం సమావేశమైన కొలీజియం.. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, గువాహటి న్యాయస్థానాలకు సంబంధించిన ఈ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఏపీ హైకోర్టుకు చెందిన ఐదుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
వీరిలో జస్టిస్ మహేశ్వరరావు కుంచం, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరి హరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ యాదవల్లి లక్ష్మణరావు ఉన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
మరోవైపు కేరళ హైకోర్టుకు చెందిన ఐదుగురు అదనపు జడ్జిలు జస్టిస్ పి.కృష్ణకుమార్, జస్టిస్ కె.వి. జయకుమార్, జస్టిస్ మురళీ కృష్ణ ఎస్., జస్టిస్ జోబిన్ సెబాస్టియన్, జస్టిస్ పి.వి. బాలకృష్ణన్‌లను కూడా శాశ్వత జడ్జిలుగా నియమించేందుకు కొలీజియం ఆమోదం తెలిపింది.
వీరితో పాటు ఉత్తరాఖండ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ సుభాష్ ఉపాధ్యాయ్, గువాహటి హైకోర్టుకు చెందిన జస్టిస్ కౌశిక్ గోస్వామిలను పర్మినెంట్ న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం నిర్ణయించింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన ఈ ప్రతిపాదనలను కేంద్ర న్యాయశాఖ పరిశీలించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది. ప్రెసిడెంట్ ఉత్తర్వుల అనంతరం పైన పేర్కొన్న న్యాయమూర్తులు శాశ్వత జడ్జీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు.











