పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఘటనలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దుచేసిన విషయం తెలిసిందే.ఈ తీర్పుపై స్టే కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దానంపై అనర్హత వేటు వేయడం సరైనదే అని సర్వోన్నత న్యాయస్థానం భావించింది. సుప్రీంకోర్టులోనూ తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంపై తాజాగా దానం నాగేందర్ స్పందించారు.
అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియపై గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని వెల్లడించారు. ఇకపై తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ‘కోర్టు తీర్పు ఈ విధంగా వస్తుందని నేను ముందే ఊహించాను. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం లీగల్‌గా నాకు కొంత ఊరట లభిస్తుందని భావించాను. అందుకే చట్టబద్ధంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను’ అని దానం చెప్పుకొచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ సెగ్మెంటుకు ఉపఎన్నిక అనివార్యమైనందున తాను ముందుగానే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఖైరతాబాద్ ప్రజలతో తనకు దశాబ్దాలుగా ప్రత్యేకమైన సాన్నిహిత్యం, అనుబంధం ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుగా ఉన్నానని, వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజా క్షేత్రంలోకి వెళ్లి వారి ఆశీర్వాదం కోరతానని వెల్లడించారు. ఖైరాతాబాద్ ప్రజల ఆశీస్సులు తన మీదే ఉంటాయనే పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.అనంతరం బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే.. కాంగ్రెస్ గుర్తు మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు.ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.ఆయన దానంకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా.. విచారించిన న్యాయస్థానం పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు నిర్దారించి అనర్హత వేటు వేసింది. తాజాగా సుప్రీంకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది.












