Harish Rao: దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి పదేపదే మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టుగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా “సంవిధాన్ బచావో” అంటూ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మాటలను ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చిందని హరీశ్ రావు సూచించారు.
రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి నిజంగా నిబద్ధత ఉంటే.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి, ప్రజల తీర్పు కోరాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికత గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో తమ పార్టీ అనుసరిస్తున్న ఫిరాయింపుల రాజకీయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? అని ప్రశ్నించారు. “సంవిధాన్ బచావో” అనేది కేవలం రాజకీయ నినాదమా? లేక నిజమైన రాజ్యాంగ నిబద్ధతా? రాహుల్ గాంధీ స్పష్టం చేయాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి పంపాలని హరీశ్ రావు అన్నారు.
దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. పదవితో పాటు పార్టీ మారితే ఫిరాయింపు కిందకే వస్తుందని, అది తప్పని కోర్టు తేల్చి చెప్పింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ గెలిచారు. 2024లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీనిపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు వేశారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న సంచలన తీర్పు ఇచ్చింది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. లోక్ సభ ఎంపీగా పోటీ చేసిన రోజు నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని.. ఖైరతాబాద్ నియోజకవర్గం ఖాళీ అయినట్లు పేర్కొంది. ఆ తీర్పును దానం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరగా.. సుప్రీంకోర్టు అందుకు నో చెప్పింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.









