Padi Kaushik Reddy: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో దానంపై హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ పై సుప్రీంకోర్టు తీర్పును ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పు ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు చెంపపెట్టు అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పోరాటంతోనే దానం నాగేందర్ పై వేటు పడిందని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. దానంపై అనర్హత విషయంలో తాము ఏదో గొప్పగా చేశామని బీజేపీ చెప్పుకోవడం సిగ్గు చేటు అని పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. నేను ఎన్నికలకే పోతాను, సుప్రీంకోర్టుకి వెళ్లను అని చెప్పిన దానం నాగేందర్ యూటర్న్ తీసుకున్నారని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఖైరతాబాద్ లో మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో తేలడంతో దానం నాగేందర్ సుప్రీంకోర్టుకి వెళ్లారని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు.
దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రోజే.. ఎన్నికల్లో ఓడిపోయినట్లు అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు పోవడానికి ఎందుకు భయపడుతున్నారని సుప్రీం ధర్మాసనం అనడం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, సిగ్గు చేటు అని చెప్పారు. చేతిలో రాజ్యాంగం పెట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి కూడా ఇది పెద్ద చెంపపెట్టు అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన మిగతా 8మంది ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుందని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.










