తెలంగాణ

BRS: పట్టభద్రుల పోరుపై గులాబీ దళం ఎక్స్‌ట్రా కేర్.. ఓటర్ నమోదుతో పాటే అభ్యర్థుల వేట!

రచన: Mahesh6 నిమిషాల పఠనం

BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా కదలిక మొదలైంది.

BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా కదలిక మొదలైంది. అయితే, అన్ని రాజకీయ పక్షాల కంటే ఒకడుగు ముందే మేల్కొన్న బీఆర్ఎస్ ఈసారి దూకుడుగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ఇంకా నెలల సమయం ఉన్నప్పటికీ, అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించి ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ సేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

ముందస్తు ప్రకటన వెనుక ఉన్న అసలు కిటుకు ఇదే

ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం ఇంత 'ఎక్స్‌ట్రా కేర్' తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందని అంటున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థులను ప్రకటించడం పార్టీల ఆనవాయితీ. కానీ గులాబీ దళం ఆ పాత పద్ధతికి స్వస్తి పలకాలని చూస్తోందట.

అభ్యర్థులను ముందుగానే అధికారికంగా ఖరారు చేస్తే, వారే నేరుగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పట్టభద్రుల ఓట్ల నమోదును వ్యక్తిగత బాధ్యతగా పర్యవేక్షిస్తారు. పట్టభద్రుల ఎన్నికల్లో అసలైన విజయం ఓట్ల నమోదులోనే ఉంటుంది. తమ స్వంత గెలుపుపై స్పష్టత ఉన్న నాయకులే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లతో ఓటరు నమోదు చేయించగలరని అధిష్టానం నమ్ముతోంది. దీంతో ఓటర్ల చేరికతో పాటు ప్రచారం కూడా అందరికంటే ముందే పరుగులు పెడుతుందని గులాబీ నేతల ఆలోచనగా కనిపిస్తుందని అంటున్నారు.

తెలంగాణ భవన్‌లో జోరుగా కసరత్తు..

ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు, కీలక నేతలతో వరుసగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారట. పోటీ భారీగా ఉండటంతో సామాజిక సమీకరణాలను పక్కాగా లెక్కలేస్తున్నారని తెలుస్తుంది.

వరంగల్ - ఖమ్మం - నల్లగొండ స్థానాన్ని ఒక ఓసీ అభ్యర్థికి కేటాయించే ఆలోచనలో నాయకత్వం ఉందని ప్రచారం జరుగుతుంది. అప్పుడే క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టిన కొందరు ఆశావహుల బలాబలాలను పరిశీలిస్తున్నారు.

మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని ప్రాథమికంగా డిసైడ్ అయినట్లు సమాచారం. ఒక ఓసీ, ఒక బీసీ అనే సామాజిక సమతూకం ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేసినట్లవుతుందని భావిస్తున్నారు.

అభ్యర్థుల సామాజిక నేపథ్యం మాత్రమే కాకుండా, గతంలో పార్టీతో ఉన్న అనుబంధం, విద్యావంతులతో ఉన్న సంబంధాలు, ఆర్థిక-రాజకీయ బలాబలాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది జాబితా విడుదల చేయనున్నారని సమాచారం.

రెండు సీట్లే.. కానీ ఆరు ఉమ్మడి జిల్లాల భవిష్యత్తు

సాంకేతికంగా ఇవి కేవలం రెండు ఎమ్మెల్సీ స్థానాలే అయినప్పటికీ, భౌగోళికంగా ఇవి తెలంగాణలోని దాదాపు 6 ఉమ్మడి జిల్లాల పరిధిని చుట్టేస్తాయి. ఈ ఎన్నికలు పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న మూడ్ యావత్ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో చేజారిన నల్గొండ-వరంగల్-ఖమ్మం పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకోవడంతో పాటు, సిట్టింగ్ స్థానమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌ను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఇక్కడ సాధించే ఘన విజయం పార్టీ శ్రేణులకు భారీ బూస్టింగ్ ఇవ్వడమే కాక, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు బలమైన బాటలు వేస్తుందని గులాబీ అధినాయకత్వం విశ్వసిస్తోంది. అందుకే అందరికంటే ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి పోరుబాట పట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందని అంటున్నారు.

#BRS#BRS Politics#Telangana Politics#TG Politics#BRS MLC Elections#Graduate MLC Elections#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి