తెలంగాణ

TG: "దానం" డిస్మిస్.. ఉప ఎన్నికకు అప్పుడే అన్ని పార్టీల్లో జోరు

రచన: Mahesh6 నిమిషాల పఠనం

TG: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు విధించిన అనర్హత వేటును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించడంతో తాజాగా రాజధాని నడిబొడ్డున ఎన్నికల నగారా మోగింది.

TG: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు విధించిన అనర్హత వేటును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించడంతో తాజాగా రాజధాని నడిబొడ్డున ఎన్నికల నగారా మోగింది. దానం వేసిన పిటిషన్‌ను విచారించేందుకే సుప్రీం నిరాకరించి కొట్టివేయడంతో ఆయనకు అన్ని దారులూ మూసుకుపోయాయి. స్పీకర్ కార్యాలయం నుంచి అధికారికంగా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ప్రకటన రావడమే తరువాయి.. ఇక ఆరు నెలల్లో ఉపఎన్నిక అనివార్యమౌతుంది.ఈ ఒక్క తీర్పుతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో అప్పుడే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.

కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? దానానికే మళ్లీ ఛాన్సా

బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ ‘బీ-ఫామ్’తో ఎంపీగా పోటీ చేయడమే దానం అనర్హతకు ప్రధాన కారణమైంది. ఇప్పుడు శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన దానం.. ‘నేను ఫైటర్‌ని, మళ్లీ గెలిచి చూపిస్తా’ అంటూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది కత్తిమీద సాములాంటి పరిణామం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక జరిగితే అది అధికార పార్టీ పనితీరుకు రెఫరెండంగా మారే ప్రమాదం ఉంది. దానం నాగేందర్‌కే మళ్లీ టికెట్ ఇచ్చి సానుభూతి, స్థానిక పట్టుతో గెలవాలా? లేక ప్రత్యామ్నాయ వ్యూహం రచించాలా? అన్న అంశంపై గాంధీ భవన్‌లో ఇప్పటికే సమాలోచనలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.

బీఆర్ఎస్ రివేంజ్ తీర్చుకుంటుందా

తమ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన నేతను న్యాయపోరాటం ద్వారా అనర్హుడిగా మార్చడంలో సక్సెస్ అయిన బీఆర్ఎస్‌కు ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారిందనే చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన గులాబీ దళం, ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని మంచి కసి మీద ఉందని అంటున్నారు. ఫిరాయింపుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని కేటీఆర్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఖైరతాబాద్‌ను మళ్లీ తమ ఖాతాలో వేసుకుని అధికార పార్టీకి బలమైన షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బరిలోకి బీజేపీ.. ట్రయాంగిల్ ఫైట్‌లో గెలుపెవరిది

ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. గత అసెంబ్లీ, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ కమలం పార్టీ చెప్పుకోదగ్గ ఓట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య తీవ్ర వైరం నెలకొన్న వేళ, త్రిముఖ పోటీ ఏర్పడితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాషాయ దళం భావిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి రాజధాని నడిబొడ్డున కాషాయ జెండా ఎగరేయాలని కమలం శ్రేణులు మంచి పట్టుదలతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

దానం నాగేందర్ న్యాయపరంగా వైదొలగడంతో ఖైరతాబాద్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు హాట్‌స్పాట్‌గా మారింది. అసెంబ్లీ స్పీకర్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ వెళ్లే ప్రక్రియ మొదలవకముందే.. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో క్షేత్రస్థాయిలోకి దూకుతున్నాయి. రాబోయే ఉపఎన్నికల కురుక్షేత్రంలో ఖైరతాబాద్ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

#Danam Nagender#Danam Nagender Disqualification#Khairatabad#Khairatabad By Election#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి