తెలంగాణ

GO 240 Protests: బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకోం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

రచన: Mahesh5 నిమిషాల పఠనం

GO 240 Protests: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన 'జీఓ నంబర్ 240' ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో అగ్గి రాజేస్తోంది. వేల కోట్ల పరిహారం ఇస్తామన్నా సరే.. తమకు ఆ డబ్బే వద్దని, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములే ముద్దంటూ రైతాంగం తెగేసి చెబుతోంది. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరిట చిన్నకారు రైతుల ఉసురు తీయవద్దంటూ ఉప్పల్ నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి.

GO 240 Protests: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన 'జీఓ నంబర్ 240' ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో అగ్గి రాజేస్తోంది. వేల కోట్ల పరిహారం ఇస్తామన్నా సరే.. తమకు ఆ డబ్బే వద్దని, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములే ముద్దంటూ రైతాంగం తెగేసి చెబుతోంది. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరిట చిన్నకారు రైతుల ఉసురు తీయవద్దంటూ ఉప్పల్ నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ క్రమంలో రైతులకు అండగా బాధితులతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించి ప్రభుత్వ విధానాలపై సమరశంఖం పూరించారు.

నయాపైసా పరిహారం వద్దు.. జీఓ 240 రద్దు చేయాల్సిందే

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని కలిసిన సందర్భంగా ఉప్పల్ రైతులు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని ముక్తకంఠంతో వినిపించారు. "మా రక్తాన్ని ధారబోసి కాపాడుకున్న భూములను ప్రాజెక్టుల పేరుతో ఎలా లాక్కుంటారు? మాకు ఎలాంటి నష్టపరిహారాలు అవసరం లేదు. మా భూములను మేము వదులుకోం. తక్షణమే జీఓ 240ని రద్దు చేయాలి" అంటూ కలెక్టర్ ఎదుట తేల్చిచెప్పారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను బలవంతంగా గుంజుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

బలవంతపు భూసేకరణను అడ్డుకుంటాం: ఎమ్మెల్యే

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలెక్టర్‌తో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మూసీ నదికి కిలోమీటర్ పరిధిలోని భూములను సేకరిస్తున్నామంటూ అధికారులు చెబుతున్న మాటలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం మొదట పూర్తిస్థాయిలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా అరకొర విస్తీర్ణంలో చిన్నచిన్న కమతాలు కలిగిన నిరుపేద రైతులు, ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న మధ్యతరగతి కుటుంబాలు, ఖాళీ స్థలాలు ఉన్న సామాన్యుల భవిష్యత్తు ఏమిటో సర్కార్ వెల్లడించాలన్నారు. అభివృద్ధి ముసుగులో పేదల పొట్టకొట్టే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రైతుల ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోవడానికి వీల్లేదని హెచ్చరించారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ప్రజాపోరాటానికి దిగుతామని ఆయన స్పష్టం చేయడంతో మూసీ భూసేకరణ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది.

#GO 240#GO 240 Protests#Bandari Laxma Reddy#Uppal MLA#Musi River#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి