Singareni: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, సరఫరాకు సంబంధించిన అంశాలపై బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఈరోజు హైదరాబాద్ లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్‌ను కలిసింది. ఈ కమిటీలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే దివాకర్ రావు, TGBKS నాయకులు రాజిరెడ్డి, సురేందర్ ఉన్నారు.
దక్షిణ భారత దేశంలోనే ఏకైక బొగ్గు గని క్షేత్రం ఉండి, దేశంలోనే రెండవ అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి (SCCL)లో 51 శాతం వాటా ఉన్న తెలంగాణను నేడు విద్యుత్ సంక్షోభం, చీకట్లలోకి నెట్టివేయడం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, తీవ్ర పరిపాలనా వైఫల్యమేనని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకపోవడంతో TG GENCO థర్మల్ యూనిట్లు మూతపడటం, సింగరేణి ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం, రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు లెక్కల్లో లేకుండా మాయం, దాదాపు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సింగరేణి భవన్‌లో సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) బుద్ధ ప్రకాష్ జ్యోతికి సమగ్ర వినతిపత్రం సమర్పించారు.
''TG GENCO థర్మల్ యూనిట్లు మూతపడుతున్నాయి లేదా వాటి స్థాపిత సామర్థ్యం కంటే చాలా తక్కువగా నడుస్తున్నాయి. నాణ్యమైన బొగ్గు కొరత , సాంకేతిక సమస్యల కారణంగా TG GENCOలో దాదాపు 1,870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. పవర్ ఎక్స్ చేంజ్ మార్కెట్ లో యూనిట్‌కు 10 రూపాయలు వెచ్చించినప్పటికీ డిస్కంలు తగినంత విద్యుత్‌ను కొనుగోలు చేయలేకపోతున్నాయి.
4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) తన సామర్థ్యంలో అతి స్వల్ప భాగాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. భద్రాద్రిలోని ఒక యూనిట్ పూర్తిగా మూతపడింది. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను రోజుకు దాదాపు ఆరు గంటలకు కుదించారు. పరిశ్రమలు జనరేటర్లపై ఆధారపడి నడుస్తున్నాయి. భూపాలపల్లి KTPPలోని 500 మెగావాట్ల యూనిట్, YTPSలోని 800 మెగావాట్ల యూనిట్ జూన్ 2026 చివరి నాటికి మూతపడ్డాయి. కేవలం బొగ్గు కొరత కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు నిలిచిపోవడం చరిత్రలోనే మొదటిసారి.
సింగరేణిలో బొగ్గు నిల్వలకు కొదవే లేదు. కానీ కాంగ్రెస్ పాలకుల అసమర్థత, దొంగ దందాల వల్ల ఉత్పత్తి పాతాళానికి పడిపోయింది. సొంత రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లను బొగ్గు లేక బంద్ పెట్టిస్తూ, పక్క రాష్ట్రాలకు మేలైన బొగ్గును ధారాదత్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల గొంతు కోయడమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023-24 నాటికి సింగరేణి 70.02 మిలియన్ టన్నుల చారిత్రాత్మక రికార్డు ఉత్పత్తిని సాధిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అది ఏకంగా 58 మిలియన్ టన్నులకు కుప్పకూలింది'' అని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లేవనెత్తిన అంశాలు..
* 2025-26లో 72 మిలియన్ టన్నుల టార్గెట్ పెడితే, సాధించింది కేవలం 58 మిలియన్ టన్నులు మాత్రమే, అంటే 81 శాతం మాత్రమే.
* కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 12-14 మిలియన్ టన్నుల ఉత్పత్తిని (17% పైగా) సంస్థ కోల్పోయింది.
* రోజుకు 1.97 లక్షల టన్నుల బొగ్గు అవసరం ఉండగా, కేవలం 1.59 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసి కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, రామగుండం, భూపాలపల్లి సహా అన్ని ఏరియాల్లో ఉత్పత్తిని అటకెక్కించారు. సంవత్సరానికి 140 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గిపోయింది, దాంతోపాటు 1600 కోట్ల రూపాయల విలువ చేసే 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది.
* డిమాండ్ లేదని యాజమాన్యం చెప్పడం పచ్చి అబద్ధం. సొంత రాష్ట్రంలో ప్లాంట్లు బొగ్గు లేక ఆగిపోతుంటే డిమాండ్ లేదనడం ఎవరిని మోసం చేయడానికి?
* టి ప్లాంట్లకు 'మట్టి బొగ్గు'.. పొరుగు రాష్ట్రాలకు 'మేలైన గ్రేడ్'!.. తెలంగాణ పవర్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తోందని ఆరోపణలు.
* ఒప్పందానికి తూట్లు:
TG GENCO కేంద్రాలకు ఒప్పందం (FSA) ప్రకారం 4,375 kcal/kg నాణ్యత గల G9-G11 గ్రేడ్ బొగ్గు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2,800-3,400 kcal/kg ఉండే అత్యంత నాసిరకం G14, G15 గ్రేడ్ 'మట్టి బొగ్గు'ను సరఫరా చేస్తున్నారు.
* యూనిట్లు మూతపడేలా కుట్ర:
ఈ నాసిరకం బొగ్గు వల్ల బాయిలర్లు దెబ్బతిని, దాదాపు 1,870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. యాదాద్రి ప్లాంట్ సామర్థ్యంలో స్వల్ప భాగమే నడుస్తుండగా, భూపాలపల్లి KTPP, భద్రాద్రి యూనిట్లు మూతపడ్డాయి.
* పక్క రాష్ట్రాలకు పండుగ:
ఆగస్టు 2026లో TG GENCOకు రావాల్సిన కోటాలో 3.90 లక్షల టన్నులు (16 శాతం) కోత పెట్టి, అదే నెలలో ఏకంగా 4.25 లక్షల టన్నుల మేలైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించారు. మన బొగ్గును బయటకు అమ్ముకుంటూ, ఛత్తీస్‌గఢ్ (SECL) నుండి అత్యవసరంగా బొగ్గును దిగుమతి చేసుకునే సిగ్గుచేటు స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు.
* ప్రజాధనం లూటీ: నాసిరకం బొగ్గు వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 2,900 కోట్ల నష్టం వాటిల్లగా, డిస్కంలు బయట మార్కెట్లో యూనిట్‌కు రూ. 10 వెచ్చించి కొనుగోలు చేయలేక చేతులెత్తేయడంతో రైతులకు ఇచ్చే కరెంట్‌ను 6 గంటలకు కుదించారు.
* రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది? సింగరేణిలో భారీ కుంభకోణం.
* మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, ఇల్లందు, సత్తుపల్లి డిపోల రికార్డుల్లో ఉన్న రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు భౌతిక తనిఖీల్లో మాయమైందని స్వయంగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
* జూలై 3న విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి, 11 వారాలు దాటినా ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు?
* అంత నిఘా వ్యవస్థలుంటే ఆ బొగ్గు ఎవరి జేబుల్లోకి పోయింది? రికార్డుల్లో ఉన్న బొగ్గు లేకపోతే TG GENCO ప్లాంట్లకు బొగ్గు ఎందుకు కొరత వచ్చింది?
49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకుండిపోయింది?
సింగరేణిలో 49 శాతం వాటా ఉండి, బోర్డులో నామినీ డైరెక్టర్లు ఉన్న కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసి చేతులు దులుపుకోవడం వెనుక ఆంతర్యమేమిటి? ఇంత పెద్ద కుంభకోణం. ఉత్పత్తి పతనం జరుగుతున్నా కేంద్రం మౌనం వహించడం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై దోపిడీదారులను కాపాడుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ తక్షణ డిమాండ్లు
FSA గ్రేడ్ బొగ్గు తక్షణ సరఫరా:
TGGENCO ప్లాంట్లకు ఇవ్వాల్సిన పూర్తి కోటా నాణ్యమైన బొగ్గును వెంటనే ఇవ్వాలి. ఇతర రాష్ట్రాలకు పంపే కంటే ముందు తెలంగాణకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
నాసిరకం సరఫరా నిలిపివేత, నష్టపరిహారం: తక్కువ గ్రేడ్ బొగ్గు సరఫరాను ఆపి, ఇప్పటివరకు జరిగిన నష్టానికి TGENCOకు పరిహారం చెల్లించాలి.
ఫోరెన్సిక్ ఆడిట్ & సీఏజీ విచారణ:
మాయమైన 40 లక్షల టన్నుల బొగ్గుపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో పాటు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తో ప్రత్యేక ఆడిట్ చేయించి నివేదికను బహిర్గతం చేయాలి.
ఉత్పత్తి పునరుద్ధరణ ప్రణాళిక: బొగ్గు ఉత్పత్తిని మళ్లీ 70 మిలియన్ టన్నుల స్థాయికి చేర్చేలా స్పష్టమైన కాలపరిమితి ప్రణాళికను ప్రజల ముందుంచాలి.
* బకాయిల పరిష్కారం:
ప్రభుత్వం, TG GENCO, సింగరేణి మధ్య ఉన్న బకాయిల సమస్యను పరిష్కరించి, ఆ నెపంతో ప్రజలపై విద్యుత్ కోతలు విధించడం తక్షణమే ఆపాలి.
హెచ్చరిక:
ఈ సంక్షోభంపై మేము అడిగిన రికార్డులు, వివరణలను 7 రోజుల్లోగా లిఖితపూర్వకంగా అందించాలి. లేని పక్షంలో ఈ దోపిడీని అసెంబ్లీ వేదికగా ఎండగట్టడంతో పాటు, కేంద్ర బొగ్గు శాఖ, సీఏజీ, న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్లి ప్రజల పక్షాన పోరాడుతామని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల హెచ్చరిక.
* సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పాతాళానికి: 2023-24లో 70.02 MT ఉన్న వార్షిక ఉత్పత్తి కాంగ్రెస్ పాలనలో 58 MTకి కుప్పకూలింది
12.02 మిలియన్ టన్నుల (17.17%) భారీ నష్టం
* వార్షిక లక్ష్యానికి 14 మిలియన్ టన్నుల (140 లక్షల టన్నుల) గండి: 72 MT సాధించాల్సిన చోట కేవలం 80.5% తో చేతులెత్తేసిన సింగరేణి యాజమాన్యం
* రోజువారీ రన్-రేట్ ఘోర పతనం: రోజుకు 1.97 లక్షల టన్నులు తీయాల్సింది పోయి 1.59 LMTకే పరిమితం
ప్రతి ఏడాది 1.40 లక్షల టన్నుల ఉత్పత్తి గల్లంతు
* కోల్పోయిన 12 MT ఉత్పత్తి TG GENCO వార్షిక కోటాలో ఏకంగా 41.6%తో సమానం: కృత్రిమ బొగ్గు కొరత సృష్టించి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన రేవంత్ సర్కార్
* రైతన్నల గోస: 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెట్టి వ్యవసాయానికి కరెంట్‌ను కేవలం 6 గంటలకే కుదించడంతో ఎండిపోతున్న పంటలు, రోడ్డెక్కుతున్న అన్నదాతలు
* పరిశ్రమల విలవిల: కరెంట్ కోతలతో మళ్లీ జనరేటర్ల బాట పట్టిన పరిశ్రమలు, మూతపడుతున్న చిన్న పరిశ్రమలు, వీధిన పడుతున్న కార్మికులు
* ప్రజలపై మోయలేని భారం: యూనిట్‌కు రూ.10 వెచ్చించినా ఎక్స్‌చేంజ్‌లో దొరకని విద్యుత్. నాసి రకం బొగ్గు సరఫరాతో ఖజానాకు రూ. 2,900 కోట్ల ప్రజాధనం నష్టం
* తెలంగాణ ప్లాంట్లకు బూడిద 'మట్టి బొగ్గు' సరఫరా చేస్తూ.. పొరుగు రాష్ట్రాలకు 4.25 లక్షల టన్నుల మేలైన బొగ్గును తరలించిన కాంగ్రెస్ ప్రభుత్వం
* రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది? 11 వారాలుగా విజిలెన్స్ విచారణ నివేదికను సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు తొక్కిపెట్టారు?
* ప్రజల కష్టాలు, ఉత్పత్తి నష్టంపై 7 రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వకపోతే శాసనసభ, సీఏజీ, కోర్టుల్లో తేల్చుకుంటామని సింగరేణి సీఎండీకి బీఆర్ఎస్ అల్టిమేటం












