Bandi Sanjay: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు సుప్రీంకోర్టు తాజా తీర్పు గట్టి చెంపపెట్టు లాంటిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజల ఓట్లతో ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ తర్వాత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరో పార్టీలోకి మారడం ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తోందని, రెండు పార్టీలదీ ఒకే తాను ముక్కల విధానమని ఆయన మండిపడ్డారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైందని స్పష్టం చేశారు. నీతిమాలిన ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని, రాబోయే ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలను జనాలే రాజకీయంగా నిమజ్జనం చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే ఏ శక్తినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.








