Spirituality

Spirituality: మనిషిలో దాగిన ఆసురీ గుణాలు.. జీవితాన్ని పతనం వైపు నడిపించే లక్షణాలు ఇవే!..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

ఇంద్రియ భోగాలపై అదుపులేని కోరికను కామం అని, కోరిక తీరనప్పుడు పుట్టే తీవ్ర ఆవేశంను క్రోధం అని అంటారు. ఈ క్రోధం పెరిగినప్పుడు విచక్షణ తగ్గుతుంది..

మనిషి జీవితంలో వెలుగు ఎంత ముఖ్యమో.. అంతరంగంలోని చీకటిని తొలగించడం కూడా అంతే ముఖ్యం. మనలోని ఆ చీకటినే శాస్త్రాలు ఆసురీ గుణాలుగా వివరిస్తాయి. ఇవి బయట కనిపించే రూపాలు కావు.. మన ఆలోచనలు, కోరికలు, భావోద్వేగాలు, ప్రవర్తనలో వ్యక్తమయ్యే అంతర్గత ప్రవృత్తులుగా పేర్కొంటారు.

అన్ని ఇంద్రియ భోగాలపై అదుపులేని కోరికను కామం అని, కోరిక తీరనప్పుడు పుట్టే తీవ్ర ఆవేశంను క్రోధం అని అంటారు. ఈ క్రోధం పెరిగినప్పుడు విచక్షణ తగ్గుతుంది.. మనిషి తన మాటపై, తన చేతలపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇక తనకు ఉన్నదాన్ని పంచుకోలేని మనస్తత్వం లోభం. అవసరానికి మించిన వస్తువులు, సంబంధాలు, సంపదపై అతుక్కుపోయే మనస్తత్వంను మోహం. ఈ మోహమే యుక్తాయుక్త విచక్షణను మసకబార్చుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

కాలం, బలం, ధనం, రూపం, యవ్వనం, విద్య, అధికారం, వంటి వాటిపై కలిగే గర్వాన్ని మదంగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఇతరులు తనకంటే ఎక్కువగా బాగుపడటం చూసి తట్టుకోలేకపోవడం మాత్సర్యం. ఇతరులపై కారణం లేకుండా ఏర్పడే మితిమీరిన ఇష్టం రాగం. అపకారం చేసినవారిపై తిరిగి అపకారం చేయాలనే భావన ద్వేషం. తనకే కష్టాలు ఎందుకు వస్తున్నాయనే బాధతో ఇతరులపై కలిగే అసహనం ఈర్ష్య. తనకు మాత్రమే సుఖం ఉండాలి.. ఇతరులకు అది దక్కకూడదనే భావన అసూయ.

తాను చేసే ప్రతి పనికి ఇతరుల ప్రశంస కావాలనే మనస్తత్వం దంభం. తనకు సాటి ఎవరూ లేరని భావించడం దర్పం. ఇక కారణం లేకుండానే ఇతరులను శిక్షించాలనే తమోగుణ ప్రవృత్తి అహంకారం. ఇవన్నీ మనిషిని బయట నుంచి కాదు.. లోపల నుంచి బంధించే గుణాలు. అందుకే ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం పూజలు చేయడం కాదు.. మనలోని ఈ ప్రవృత్తులను గమనించి, ఒక్కొక్కటిగా అధిగమించే అంతరంగ ప్రయాణం అని చెబుతారు.

సాధనతో మనస్సు శుద్ధి చెందుతుంది. గురువు మార్గదర్శకత్వం మనకు దిశను చూపుతుంది. శాస్త్రాలు ఏది చేయాలో.. ఏది చేయకూడదో వివేకాన్ని అందిస్తాయి. కాబట్టి శాస్త్ర ఆదేశానుసారం కర్మ చేయడం, ఇంద్రియాలను నియంత్రించడం, సత్యాన్ని ఆచరించడం, దానం చేయడం, క్షమను పెంపొందించడం, భగవంతుని స్మరించడం ఇవే ఆసురీ గుణాలను క్రమంగా తొలగించే మార్గాలుగా ఆథ్యాత్మిక గ్రంధాలు చెబుతాయి..

మనలోని కామం కరిగిన చోట శాంతి పుడుతుంది.. క్రోధం తగ్గిన చోట క్షమ వికసిస్తుంది.. లోభం తొలగిన చోట దానం పుడుతుంది.. అహంకారం కరిగిన చోట భక్తి వెలుగుతుంది. అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే మనిషి నిజమైన ఆధ్యాత్మిక ప్రగతిని ప్రారంభిస్తాడు. అదే సాధన సారాంశం.. అదే మానవ జన్మకు పరమార్థం అని వేదాలు, శాస్త్రాలు బోధిస్తున్నాయి..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Bad habits#Thoughts#desires#emotions
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి